గవర్నర్ చేతిలోకి జమ్మూ కశ్మీర్..

     Written by : smtv Desk | Wed, Jun 20, 2018, 12:26 PM

గవర్నర్ చేతిలోకి జమ్మూ కశ్మీర్..

శ్రీనగర్‌, జూన్ 20 : జమ్ముకశ్మీర్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో గవర్నర్‌ పాలన విధించాలంటూ మంగళవారం గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ఆ ప్రతిని కేంద్ర హోంశాఖకు కూడా పంపించారు. ఈ సిఫార్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈరోజు ఉదయం ఆమోదం తెలిపారు. దీంతో కశ్మీర్‌లో నేటి నుంచి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఉగ్రవాదం పెరిగిపోతున్నా కట్టడి చేయడంలో పార్టీ విఫలమవ్వడంతోనే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు భాజపా వెల్లడించింది.

గత ఎన్నికల్లో 87అసెంబ్లీ స్థానాలున్న జమ్ముకశ్మీర్‌లో పీడీపీకి 28 సీట్లు, భాజపాకు 25 స్థానాలు దక్కాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి 15 సీట్లు, కాంగ్రెస్‌కు 12సీట్లు, ఇతరులకు 7 స్థానాలు లభించాయి. కాగా పీడీపీ, భాజపా కలిసి ప్రభుత్వాన్నిఏర్పాటు చేశాయి. ఎన్‌.ఎన్‌.వోహ్రా 2008 నుంచి జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు కశ్మీర్‌కు సంబంధించి చర్చల్లో పాల్గొనే కీలక వ్యక్తిగా పనిచేశారు. ఆయన కశ్మీర్‌లో ఉన్న ఈ పదేళ్ల సమయంలో మూడు సార్లు గవర్నర్‌ పాలన విధించారు.

అలాగే తాజా గవర్నర్‌ పాలనతో జమ్ముకశ్మీర్‌లో 1977 నుంచి ఎనిమిదో సారి గవర్నర్‌ పాలన విధించారు. గవర్నర్‌ ఎన్‌.ఎన్‌. వోహ్రా ఈరోజు మధ్యాహ్నం ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా హయాంలోనే ఇక్కడ గతంలో మూడుసార్లు గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. తాజాగా గవర్నర్‌ పాలన విధించడంతో ఆయన హయాంలో నాలుగోసారి ఇది అమల్లోకి వచ్చింది.





Untitled Document
Advertisements