కుల్దీప్ బంతితో... కే.ఎల్ బ్యాటుతో..

     Written by : smtv Desk | Wed, Jul 04, 2018, 11:08 AM

కుల్దీప్ బంతితో... కే.ఎల్ బ్యాటుతో..

మాంచెస్టర్‌, జూలై 4 : ఇంగ్లీష్ గడ్డపై కోహ్లి సేన ఆరంభం అదిరింది. మూడు టీ20ల భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బంతితో కుల్‌దీప్‌ యాదవ్‌ (5/24), బ్యాటుతో కేఎల్‌ రాహుల్‌ (101 నాటౌట్‌; 54 బంతుల్లో 10×4, 5×6) చెలరేగడంతో 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును విరాట్ సేన మట్టికరిపించింది. కుల్‌దీప్‌ స్పిన్ మ్యాజిక్ కు మొదట ఇంగ్లాండ్‌ 8 వికెట్లకు 159 పరుగులే చేయగలింది. బట్లర్‌ (69; 46 బంతుల్లో 8×4, 2×6) చెలరేగి ఆడినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ నుంచి అతడికి సహకారం లభించలేదు. రాహుల్‌ వీరబాదుడు బాదడంతో లక్ష్యాన్ని భారత్‌ 18.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిచేధించింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్‌ ఐదు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్‌ రెండు, హార్దిక్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

తర్వాత లక్ష్య చేధనకు దిగిన టీమిండియా జట్టు తొలి ఓవర్లోనే ధావన్‌ (4) వికెట్ ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్‌ మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులెత్తించాడు. ఆరంభం నుంచే ఇంగ్లీష్‌ బౌలర్లపై రాహుల్‌ ఎదురుదాడికి దిగగా, రోహిత్‌ శర్మ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలోనే 27 బంతుల్లోనే రాహుల్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 123 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడిని రషీద్‌ విడదీశాడు. రోహిత్‌ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్‌) వెనుదిరిగాడు. ఈ క్రమంలో 52 బంతుల్లో రాహుల్‌ తొలి సెంచరీ చేయగా ఓ సిక్సర్‌తో కోహ్లీ మ్యాచ్‌ను ముగించాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కులదీప్ యాదవ్ కు దక్కింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో టీ20 శుక్రవారం జరుగుతుంది.





Untitled Document
Advertisements