జియోకు ఐఓఈ హోదా.. కేంద్రంపై విమర్శలు..

     Written by : smtv Desk | Tue, Jul 10, 2018, 12:10 PM

జియోకు ఐఓఈ హోదా.. కేంద్రంపై విమర్శలు..

ఢిల్లీ, జూలై 10 : కేంద్ర మానవ వనరులశాఖ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఆరు విద్యాసంస్థలకు ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఐఓఈ)హోదా కల్పించిన విషయం తెలిసిందే. మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ హోదా కల్పించినట్లు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వీటిలో 3 ప్రభుత్వ, 3 ప్రయివేటు విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రయివేటు విద్యాసంస్థల్లో బిట్స్‌ పిలానీ, మణిపాల్‌ యూనివర్శిటీ, జియో ఇనిస్టిట్యూట్‌(రిలయన్స్‌ ఫౌండేషన్‌) ఈ హోదా దక్కించుకున్నాయి. అయితే జియో ఇనిస్టిట్యూట్‌కు 'శ్రేష్ఠతర' హోదా కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంకా ప్రారంభం కాని ఓ విద్యాసంస్థకు ఉన్నతస్థాయి హోదా ఎలా ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విటర్‌ వేదికగా దీనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా దీనిపై విమర్శలు గుప్పించింది. రిలయన్స్‌ ఫౌండేషన్‌కు అనుకూలంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేసింది.

"ముకేశ్‌, నీతా అంబానీకి అనుకూలంగా భాజపా ప్రభుత్వం మరోసారి పనిచేసింది. ఇంకా ప్రారంభం కాని జియో ఇనిస్టిట్యూట్‌కే శ్రేష్ఠతర హోదా ఇచ్చారు. ఏ ప్రమాణాల ఆధారంగా ఈ హోదా ఇచ్చారనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది" అని కాంగ్రెస్‌ ట్వీట్‌ ద్వారా ప్రశ్నించింది. అయితే కాంగ్రెస్‌ ట్వీట్‌పై స్పందించిన విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ).. గ్రీన్‌ఫీల్డ్‌ సంస్థల కేటగిరి కింద జియోకు ఈ హోదా ఇచ్చినట్లు స్పష్టం చేసింది.





Untitled Document
Advertisements