బిగ్గెస్ట్ బడ్జెట్.. భారీ ఫ్లాప్..

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 12:57 PM

బిగ్గెస్ట్ బడ్జెట్.. భారీ ఫ్లాప్..

బీజింగ్, జూలై 18‌: సినిమా.. అదో రంగుల ప్రపంచం.. ప్రేక్షకులకు మూడు గంటలు ఆహ్లాదపరిచే ఆ కష్టం వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉంది. ప్రస్తుతం చిత్రాలకు వ్యయం భారీగా పెరిగిపోయింది. ఒక్కో సారి చిన్న బడ్జెట్‌తో తీసే సినిమాలు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. కానీ ఎక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవు. అలాంటిదే ఒకటి చైనాలో జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 113 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.700 కోట్లు. ఇంత బడ్జెట్‌తో సినిమా తీస్తే దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తొలి వారంలోనే సినిమా థియేటర్ల నుంచి తొలిగించారు.

చైనాకు చెందిన అలీబాబా పిక్చర్స్‌ సంస్థ ‘అసుర’ అనే సినిమాను నిర్మించింది. చైనా చరిత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. టిబెటన్‌ బుద్దిస్ట్‌ల పౌరాణిక కథల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం భారీ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ను వాడారు. ఎన్నో ఆశలతో ఈ సినిమాను గత శుక్రవారం విడుదల చేశారు. కానీ సినిమాపై చిత్రబృందం పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. శనివారానికి ఈ సినిమా కేవలం 7.3 మిలియన్‌ డాలర్లు మాత్రమే రాబట్టింది.

దాంతో సినిమా అట్టర్‌ ఫ్లాపైందని భావించి ఆదివారం రాత్రి 10 గంటలకు సినిమాను థియేటర్‌ నుంచి తీసేశారు. 'అసుర' ప్రపంచవ్యాప్తంగా ఫ్లాప్‌ అయిన సినిమాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కారణంగా చిత్రబృందం 106 మిలియన్‌ డాలర్లు నష్టపోవాల్సి వచ్చింది. సినిమా మొత్తంలో 2,400 సన్నివేశాలున్నాయి. నిడివి 141 నిమిషాలు. హాంగ్‌కాంగ్‌కు చెందిన నటులు టోనీ కాఫాయ్‌, కరీనా లౌ నటించారు.





Untitled Document
Advertisements