భారత్‌ పేలవ ప్రదర్శన

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 01:05 PM

భారత్‌  పేలవ ప్రదర్శన

ఐదో టెస్టులో తొలి రోజు ఫర్వాలేదనిపించిన భారత్‌ శనివారం మాత్రం తేలిపోయింది. ఇంగ్లాండ్‌ లోయర్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు చేర్చడంలో భారత బౌలర్లు విఫలం కావడం, మరోవైపు బ్యాట్స్‌మెన్‌ కూడా ఆకట్టుకోలేకపోయారు.వేదికలు మారుతున్నా..భారత బ్యాటింగ్ తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు వరుస ఓటముల నేపథ్యంలో మాజీలు విమర్శలు గుప్పిస్తున్నా..తమ ఆటతీరు మార్చుకోకుండా అప్పనంగా వికెట్లు సమర్పించుకుంటున్న తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. ఆతిథ్య జట్టు పరుగుల వరద పారిస్తున్న చోట మనోళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమవుతూ పరాజయాలకు కారణమవుతున్నారు. గత టెస్ట్‌లకు కొనసాగింపు అన్నట్లుగా పేలవ బ్యాటింగ్ ప్రదర్శిస్తున్న భారత్..మరోమారు ఇంగ్లండ్ బౌలింగ్‌కు దాసోహమైంది. కెప్టెన్ కోహ్లీ మినహా పరుగుల వేటలో సహచరులు విఫలమైన వేళ టీమ్‌ఇండియా మరో ఓటమికి అడుగుదూరంలో ఉన్నది. సీనియర్లు ఆకట్టుకోని చోట తెలుగు కుర్రాడు విహారీ తెగువచూపుతుండటం కొంతలో కొంత ఊరట కల్గించే అంశం. బట్లర్, బ్రాడ్ బాదుడుతో భారీ స్కోరు అందుకున్న ఇంగ్లండ్..ఐదో టెస్ట్‌పై మరింత పట్టు బిగించింది.

దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. పుజారా (37), రాహుల్‌ (37) ఫర్వాలేదనిపించారు.

క్రీజులో విహారి (25 బ్యాటింగ్‌), జడేజా (8 బ్యాటింగ్‌) ఉన్నారు. ఆండర్సన్‌, స్టోక్స్‌లకు రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 198/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టులో జోస్ బట్లర్ (133 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 89), బ్రాడ్‌ (59 బంతుల్లో 3 ఫోర్లతో 38) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 122 ఓవర్లలో 332 పరుగుల వద్ద ముగించింది. జడేజాకు నాలుగు, బుమ్రా.. ఇషాంత్‌లకు మూడేసి వికెట్లు తీశారు.

Untitled Document
Advertisements