హెచ్-4 వీసాలు రద్దు?

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 05:32 PM

హెచ్-4 వీసాలు రద్దు?

అమెరికాలో పనిచేస్తున్న లేదా స్థిరపడినవారి జీవితభాగస్వాములు కూడా పనిచేసుకోవడానికి వీలు కల్పించేవి హెచ్-4 వీసాలు. అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా హెచ్-4 వీసాలను నిలిపివేయాలని భావిస్తోంది. మరో మూడు నెలలలో వీటిపై తుది నిర్ణయం తీసుకొంటామని ట్రంప్ సర్కార్ ఫెడరల్ కోర్టుకు తెలియజేసింది. ఒకవేళ ఆ వీసాలు రద్దు చేస్తే విదేశీ ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఇక అమెరికాలో ఎక్కడా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఇంటికే పరిమితం కావలసి ఉంటుంది. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడపడం కష్టం అనుకొంటే వారు తప్పనిసరిగా స్వదేశాలకు తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. కానీ పిల్లల చదువులు వగైరా కారణాల చేత వారు స్వదేశాలకు తిరిగి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుంది.

2017, డిసెంబర్ 25 లెక్కల ప్రకారం అమెరికాలో మొత్తం 1,26,853 మంది హెచ్-4 వీసాలతో పనిచేస్తున్నవారున్నారు. వారిలో సుమారు 93 శాతం మంది భారతీయులే. మిగిలిన 7 శాతం ఇతరదేశాలవారున్నారు. కనుక వాటిని రద్దు చేస్తే అత్యధికంగా నష్టపోయేది మన భారతీయులేనని స్పష్టం అవుతోంది. హెచ్-4 వీసాలు రద్దు చేస్తే ప్రవాస భారతీయులతో సహా అమెరికాలో స్థిరపడ్డ లక్షలాది విదేశీయ కుటుంబాలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసిరావచ్చు. అలాగే హెచ్-4 వీసాలపై అమెరికా వెళ్లాలనుకొన్నవారికీ నిరాశ తప్పదు.

Untitled Document
Advertisements