గెలుపు ఎవరిది ?

     Written by : smtv Desk | Thu, Dec 06, 2018, 02:47 PM

గెలుపు ఎవరిది ?

గత రెండున్నర నెలలుగా ప్రజాకూటమి, తెరాస రెండు విభిన్నమైన వాదనలతో ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ప్రజాకూటమిని గెలిపిస్తే పొరాడి సాధించుకొని అభివృద్ధి చేసుకొన్న రాష్ట్రం మళ్ళీ పరాయిపాలనలోకి వెళ్లిపోతుందని తెరాస బలంగా వాదించగా, మిగులు బడ్జెటుతో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం నాలుగేళ్ళలో అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడమే కాకుండా నిరంకుశ, అప్రజాస్వామిక, కుటుంబపాలన చేస్తూ, గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేసిన సిఎం కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజాకూటమి వాదించింది. అయితే ఇరుపక్షాల వాదనలలో కొన్ని నిజాలు, కొన్ని అబద్దాలు కూడా ఉన్నాయని చెప్పక తప్పదు.

ప్రజాకూటమిలో నాలుగు పార్టీలు చేతులు కలిపాయి కనుక వాటి ఐక్యతతో తెరాసకు నష్టం కలిగే అవకాశముంటుంది కనుక వాటి విశ్వసనీయతను దెబ్బతీయడానికి, ప్రజాకూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న చంద్రబాబును, కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపాలనుకోవడం చాలా తెలివైన వ్యూహమే...కానీ అర్ధరహితమైనది కూడా. ఎందుకంటే, ఒకవేళ ప్రజాకూటమి ఏర్పడకుండా నాలుగు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఉండి ఉంటే అప్పుడు తెరాస ఈ ‘పరాయి పాలన’ వాదన చేసి ఉండేదే కాదు. అప్పుడు ముందే అనుకొన్నట్లుగా నాలుగేళ్ళలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మాత్రమే గట్టిగా ప్రచారం చేసుకొని ఉండేది. కనుక తెరాస తన అధికారం కోల్పోకుండా కాపాడుకొనేందుకే ఈ వాదన చేసిందని చెప్పవచ్చు.

తెరాస తమ విశ్వసనీయతను దెబ్బ తీస్తూ చేస్తున్న వాదనలను తట్టుకొని నిలబడాలంటే తెరాస బాషలోనే ప్రజాకూటమి సమాధానాలు చెప్పక తప్పదు. కనుకనే తెరాస నిరంకుశ, అప్రజాస్వామిక, కుటుంబపాలనను, ప్రాజెక్టులలో అవినీతిని తమ ఎన్నికల ప్రధాన అస్త్రంగా మలుచుకొందని చెప్పవచ్చు. అలాగే కొన్ని హామీల అమలులో తెరాస వైఫల్యాలను ప్రజాకూటమి ఆయుధాలుగా ఉపయోగించుకొంది. తెరాస పాలనలో అవినీతి జరిగిందా లేదా జరిగితే అది ఏ స్థాయిలో ఉందనేది రేపు ప్రజలే నిర్ణయిస్తారు. కానీ మిగులు బడ్జెట్, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడమనే ప్రజాకూటమి వాదనలు సామాన్య ప్రజలకు సులువుగా అర్దమయ్యేలా చెప్పి వారిని ఆకర్షించడానికేనని చెప్పవచ్చు. ఒకవేళ రేపు ప్రజాకూటమి అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కోసమంటూ కొత్త అప్పులు చేయకమానదు. అంటే తెరాస, ప్రజా కూటమి భిన్న వాదనలు వాటి ఎన్నికల వ్యూహంగా మాత్రమే భావించాల్సి ఉంటుంది.

ప్రజలు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇరువర్గాలు తమ ప్రత్యర్ధుల విశ్వసనీయతను దెబ్బ తీసి పైచేయి సాధించడానికే ప్రయత్నించాయి తప్ప ప్రజలు... వారి సమస్యల కేంద్రంగా చర్చించలేదు. ఎవరి వాదనలు వారు వినిపించారు కనుక ప్రజలు ఎవరి వాదనలతో ఏకీభవిస్తారనేది రేపు పోలింగ్ ముగిసే సమయానికే కొంతవరకు తెలిసిపోతుంది. డిసెంబరు 11వ తేదీన పూర్తి స్పష్టత వస్తుంది.





Untitled Document
Advertisements