'పేట'కు థియేటర్ల మాఫియా సెగ..

     Written by : smtv Desk | Mon, Jan 07, 2019, 11:18 AM

 'పేట'కు థియేటర్ల మాఫియా సెగ..

హైదరాబాద్, జనవరి 7: ఆంధ్ర, తెలంగాణాలలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'పేట' సినిమాకు థియేటర్ల మాఫియా కారణంగా సమస్య ఉందని చిత్ర నిర్మాత టి.ప్రసన్నకుమార్ అన్నారు. సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరని, అయితే, ముగ్గురు, నలుగురు చేస్తున్న సినిమాలకు మాత్రమే అన్ని థియేటర్లనూ కేటాయించుకుంటున్నారని, ఇతరులను బతకనిచ్చే పరిస్థితి లేదని ఆయన వాపోయారు.

రజనీ కాంత్ తాజా చిత్రం 'పేట' సంక్రాంతి సందర్బంగా ఈ నెల 10న విడుదలవుతున్న నేపథ్యంలో మరో నిర్మాత వల్లభనేని అశోక్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, కొత్త వాళ్లును రానివ్వకుండా థియేటర్ల మాఫియా చాలా నీచంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సంక్రాంతికి కనీసం ఆరేడు సినిమాలకు ప్రేక్షకులు ఉంటారని, కానీ, ఉన్న అన్ని థియేటర్లలో రెండు మూడు సినిమాలు మాత్రమే ఆడిస్తుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఈ మాఫియాను తొలగించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులతో మాట్లాడతామని, తమ సినిమాలే ఉండాలన్న ధోరణి మంచిది కాదని అన్నారు.

అయితే, ఈ సంక్రాంతికి 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'పేట', 'వినయ విధేయ రామ', 'ఎఫ్ 2'లతో పాటు 'విశ్వాసం', 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' వంటి సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో రెండు మూడు సినిమాలకు కనీసం 100 థియేటర్లు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు.





Untitled Document
Advertisements