తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దం

     Written by : smtv Desk | Wed, Jan 09, 2019, 01:38 PM

తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దం

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణలో రానున్న లోక్ సభ ఎన్నికలకు టీ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య పెరుగుతూ పోతుంది. లోక్ సభ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టీపీసీసీని లోక్ సభ ఎన్నికలకు సమాయాత్తం కావాలని ఆదేశించింది. లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించాలని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ మధ్యనే గాంధీభవన్‌లో తెలంగాణలోని పదిహేడు లోక్‌సభ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను కూడా పూర్తి చేశారు. ఈ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న నేతల పేర్లను కూడా ఈ సమావేశాల్లో సేకరించారు.

అయితే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా చూస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న భువనగిరి టికెట్‌ కోసం పార్టీ నేతల మధ్య భారీ పోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి ప్రస్తుతం టీ పీసీసీ కోశాధికారిగా కొనసాగుతున్న గూడూరు నారాయణరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఏఐసిసి కార్యదర్శి మధుయాష్కి టికెట్లు ఆశిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనగామ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోగా, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం గత లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసిన మధుయాష్కి ఓటమి చవిచూశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన నేతలకు లోక్‌సభ ఎన్నికలలో టికెట్లు ఇచ్చేది లేదని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో పొన్నాలకు భువనగిరి టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మధుయాష్కి గతంలో ప్రాతినిద్యం వహించిన నిజామాబాద్‌ నుంచే తిరిగి పోటీకి దింపే ఆలోచనలో యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

కాగా వీరందరిలో గూడూరు నారాయణరెడ్డికి భువనగిరి లోక్‌సభ టికెట్‌ కేటాయించే అవకాశాలు అధికంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గూడూరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యవహారాలను అన్నీ తానై ఒంటి చెత్తో నిర్వహించారు. పార్టీకి సంబంధించి ఆర్థిక వ్యవహారాలతో పాటు ఇక్కడ ప్రచారం నిర్వహించిన జాతీయ స్థాయి నేతలు, సీఎంలు, మాజీ సీఎంలు, పార్లమెంటు సభ్యుల షెడ్యూల్‌, సెక్యూరిటీ, ప్రోటోకాల్‌ వంటి ముఖ్యమైన అంశాలన్నీ తానే చూసుకున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ నేతల భద్రత పట్ల కక్షపూరితంగా వ్యవహరించింది. ముఖ్యంగా టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతితో పాటు స్వయంగా గూడూరు నారాయణరెడ్డికి సైతం తగినంత భద్రతను కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ దశలో గూడూరు కాంగ్రెస్‌ పార్టీలోని ముఖ్యమైన నేతలందరికీ భద్రత కల్పించాలని డీజీపీకి వినతి పత్రం సమర్పించారు.

ఆయన వినతికి స్పందించిన డీజీపీ వెంటనే ఉత్తమ్‌కు భారీ భద్రతను సమకూర్చింది. ఈ విషయంలో ఆయన టీఆర్‌ఎస్‌పై విజయం సాధించినట్లయింది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికలలో టీ పీసీసీకి అధిష్టానానికి మధ్య ఆయన వారధిగా వ్యవహరించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సంబంధించి యుపిఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ పాల్గొన్న మేడ్చల్‌ సభకు, ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ వ్యాప్తంగా పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల ఏర్పాట్లలోనూ గూడూరు కీలకపాత్ర పోషించారు. దీంతో గూడూరు అధిష్టానం దృష్టిని ఆకర్శించారు. 2004,09, 14తో పాటు గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ భువనగిరి టికెట్‌ ఆశించారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో భువనగిరి లోక్‌సభ టికెట్‌ ఇస్తామన్న అధిష్టానం హామీ మేరకు ఆయన టికెట్‌ను ఇతర నేతలకు త్యాగం చేశారు.

కాగా, భువనగిరి లోక్‌సభ టికెట్‌ ఆశిస్తున్న గూడూరుకు పార్టీ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే తమకెెలాంటి అభ్యంతరం లేదని కోమటిరెడ్డి బ్రదర్స్‌ సైతం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో పాటు లోక్‌సభ ఎన్నికలలో కొత్త వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఏ ఎన్నికలలో పోటీ చేయని గూడూరుకు భువనగిరి లోక్‌సభ టికెట్‌ కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం టీ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి భువనగిరి లోక్‌సభ టికెట్‌ను కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.





Untitled Document
Advertisements