అలా చేస్తే ప్రపంచ కప్ 2019 టీం ఇండియా సొంతం...ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

     Written by : smtv Desk | Wed, Feb 13, 2019, 06:04 PM

అలా చేస్తే ప్రపంచ కప్ 2019 టీం ఇండియా సొంతం...ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ 2019 సందర్భంగా టీం ఇండియా పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ కప్ ను గెలిచేందుకు టీం ఇండియాకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని, అందుకోసం భారత జట్టు కొన్ని ప్రయోగాలు చేయాలని ఆయన సూచించారు. తన సూచనలను పాటిస్తే ఈ మెగా టోర్నీలో భారత్ కు ఎదురుండదని ఈ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం వెల్లడించాడు. భారత్ రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొన్ని మార్పులతో ఆటగాళ్లను బరిలోకి దించాలని వార్న్ అన్నారు. అంతేకాక ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

ప్రస్తుతం ఉన్న ఓపెనర్లు రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ లో అత్యుత్తమంగా ఆడుతున్నారని ప్రశంసిస్తూనే ప్రపంచ కప్ టోర్నీలో మాత్రం రోహిత్ కు తోడుగా యువ ఆటగాడు రిషబ్ పంత్ ను ఓపెనర్ గా బరిలోకి దించాలని వార్న్ సూచించారు. ఈ ప్రయోగం ద్వారా ప్రత్యర్థి జట్లు రోహిత్- శిఖర్ జోడీని విడగొట్టడానికి ముందుగానే సిద్దం చేసుకున్న వ్యూహాలు పనిరాకుండా పోతాయన్నారు. ఇలా ప్రత్యర్థులను అయోమయానికి గురిచేస్తూ వారు తేరుకునే లోపే విజయ తీరాలను చేరవచ్చని వార్న్ అభిప్రాయపడ్డారు. ఓపెనర్లను నేరుగా ప్రపంచ కప్ లో కాకుండా అంతకుముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ లో బరిలోకి దించాలన్నారు.

దీని వల్ల ఓపెనర్లిద్దరి మధ్య సమన్వయం కుదరడంతో పాటు జట్టుకు విశ్వాసం ఏర్పడుతుందన్నారు. భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం బాగా రాణిస్తున్నాడని...భవిష్యత్‌లొ అతడు మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకుంటాడని వార్న్ జోస్యం చెప్పారు. ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టులో ధోనితో పాటు రిషబ్ ను కూడా ఎంపిక చేయాలని సూచించారు. అతన్ని ఓ వికెట్ కీపర్ గా కాకుండా ఓ బ్యాట్ మెన్ గా మాత్రమే పరిగణించి అవకాశం కల్పించాలని వార్న్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements