ఇదే ప్రధాని మోదీకి నాకు తేడా: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 11:16 AM

ఇదే ప్రధాని మోదీకి నాకు తేడా: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రఫెల్ డీల్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో సరి ధ్వజమెత్తారు. రఫేల్‌ కాంట్రాక్టు అనిల్ అంబానీ కంపెనీకి అప్పగించడంలో ఫ్రాన్సు ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు హొలాండే స్పష్టం చేశారు. కాగా, రాహుల్ పరోక్షంగా మాట్లాడుతూ, 'కాపలాదారే దొంగ' అన్న విషయం ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడికి కూడా తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు.

గుజరాత్‌ రాష్ట్రం వల్సద్‌ జిల్లా ధరంపూర్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్‌ ర్యాలీతోపాటు అజ్మీర్‌లో కాంగ్రెస్‌ సేవా దళ్‌ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, తన స్నేహితుడు అనిల్ అంబానీ కొరకు మోదీ దళారీగా మారిపోయి డసో ఏవియేషన్‌ సంస్థతో సమాంతర చర్చలు జరిపారంటూ రక్షణ శాఖ, వైమానిక దళాధికారులే పేర్కొన్నారంటూ రాహుల్, 'చౌకీదారే దొంగ' అన్న నినాదం ఫ్రాన్స్‌కు కూడా చేరింది అని అన్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రజలతో 'చౌకీదార్‌ చోర్‌ ఛే(గుజరాతీ)' అంటూ నినాదం చేయించారు. "మోదీ 15 మంది పారిశ్రామిక వేత్తల లాభం కోసమే దేశాన్ని పాలిస్తున్నారు" అని రాహుల్ విమర్శించారు. పంట రుణాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను పట్టించుకోకుండా 15 మంది పెద్ద పారిశ్రామికవేత్తలకు చెందిన రూ. 3.5 లక్షల కోట్ల అప్పును మాత్రం మాఫీ చేశారని విమర్శించారు. ఎలాగైతే మోదీ ప్రభుత్వం అనిల్ అంబానీకి రూ. 30వేల కోట్లు లబ్ది చేకుర్చిందో అలాగే తమ పార్టీ అధికారం లోకి వస్తే పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తామని పేర్కొన్నారు.

భారతీయ జనత పార్టీ(బీజేపీ) మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తలు లాఠీలు పట్టుకుని సమాజంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. వారు పెంచుతున్న విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలని సేవాదళ్‌ కార్యకర్తలకు రాహుల్‌ పిలుపునిచ్చారు. "భయానికి మరో రూపమే విద్వేషం. భయం అనేది లేకుండా విద్వేషం పుట్టదు. ఇదే ప్రధాని మోదీకి నాకు తేడా.

కాంగ్రెస్‌కు ద్వేషం లేదు ఎందుకంటే మనలో భయం లేదు. కానీ, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌కి ద్వేషం ఉంది. తమకున్న భయాన్ని దాచుకునేందుకే వారంతా విద్వేషాన్ని ప్రదర్శిస్తారు" అని వ్యాఖ్యానించారు. "వచ్చే ఎన్నికల్లో వారి(బీజేపీ)ని మనం అంతం చేయం. హత్య చేయం. వారిపై చేయిచేసుకోబోం. కానీ, ఓడిస్తాం. అదీ ప్రేమతోనే" అని అన్నారు రాహుల్.





Untitled Document
Advertisements