నగదు కష్టాల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌!

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 01:08 PM

నగదు కష్టాల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌!

న్యూఢిల్లీ: ప్రముఖ దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) సంస్థ నగదు కష్టాల్లో ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ సంక్షోభంతో బిక్కుబిక్కుమంటున్న నేపథ్యంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కష్టాల బారిన పడడం ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగానికి పెద్ద షాకే అని చెప్పవచ్చు. డిపాజిట్ల ముందస్తు ఉపసంహరణలను నిలిపివేసిన సంస్థ.. కొత్త డిపాజిట్లనూ స్వీకరించడం లేదు. దీంతో సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు కలుగుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. ‘మా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ప్రోగ్రాంపై క్రెడిట్‌ రేటింగ్‌లో చోటుచేసుకున్న ఇటీవలి మార్పు దృష్ట్యా అన్ని కొత్త డిపాజిట్లను అంగీకరించడం లేదు. రెన్యువల్స్‌నూ ఆపేశాం. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వర్గాలు తెలిపాయి. కాగా, మా లయబిలిటి మేనేజ్‌మెంట్‌ పునర్‌వ్యవస్థీకరణ వల్ల కూడా కాలపరిమితి తీరని డిపాజిట్ల ఉపసంహరణను ఆపేశామని సంస్థ వర్గాలు తెలియజేశాయి. కాగా, ఇదంతా కూడా నేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) నిబంధనల ప్రకారమే జరుగుతున్నదని, ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ రేటింగ్‌ లేకపోతే డిపాజిట్లను స్వీకరించరాదని నియమావళి కంపెనీలకు స్పష్టంగా చెబుతున్నట్లు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ వైద్య ఖర్చులు లేదా తప్పనిసరి ఆర్థిక అవసరాల కోసం డిపాజిట్ల ముందస్తు ఉపసంహరణ కోరితే పరిశీలిస్తున్నామని సదరు వర్గాలు వెల్లడించాయి.





Untitled Document
Advertisements