మన దేశంలో వర్షాలు పడాలంటే...ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ కు మార్చాలి

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 05:51 PM

మన దేశంలో వర్షాలు పడాలంటే...ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ కు మార్చాలి

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్‌కు కూడా వాన ముప్పు ఉన్నట్టు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ప్రపంచకప్‌లో వర్షం కారణంగా ఇన్ని మ్యాచ్‌లు రద్దు కావడం ఇదే తొలిసారి.

ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్‌లలో ఒక మ్యాచ్‌కు మించి రద్దు అయిన దాఖలాలు లేవు. వరుసపెట్టి మ్యాచ్‌లు రద్దు అవుతుండడంపై ఐసీసీపై అభిమానులు మండిపడుతున్నారు. షెడ్యూలును తప్పుబడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే సగం మ్యాచులను వాన దేవుడు ఎత్తుకెళ్లేలా ఉన్నాడని, మెగా టోర్నీ షెడ్యూలును అత్యంత చెత్తగా రూపొందించిన ఐసీసీ సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గురువారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా వర్షార్పణం అయింది. దీంతో వర్షం కారణంగా రద్దు అయిన మ్యాచ్‌ల సంఖ్య నాలుగుకు పెరిగింది. భారత్-కివీస్ మ్యాచ్ రద్దుపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ప్రస్తుతం మన దేశంలో వర్షాల అవసరం ఎంతో ఉందని, కాబట్టి ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్‌కు మళ్లించాలని, అలాగైనా దేశంలో వర్షాలు పడతాయేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. అమితాబ్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు.





Untitled Document
Advertisements