దాడులపై మండిపడ్డ నారా లోకేష్... ఇదేనా రాజన్న రాజ్యం ?

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 08:14 PM

ఏపీలో ఎన్నికల సమయంలో మొదలయిన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తల దాడులు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో.. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటి వరకు ఐదుగురు కార్యకర్తలు ప్రాణాలు విడిచారని టీడీపీ ఆడిపోసింది. అంతేకాక పిన్నెల్లి గ్రామంలో వంద కుటుంబాలు దాడులకి భయపడి ఊరు విడిచి వేల్లిపోయినట్టు సమాచారం. ఈ క్రమంలో రేపు డీజీపీని కలిసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ దాడులపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వరుస ట్వీట్లలో వైసీపీ తీరుని ఎండ గట్టారు. దాడులు, దౌర్జన్యాలతో టీడీపీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని, గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్పించి అరాచకాలకు మార్గం కాకూడదని లోకేశ్ హితవు పలికారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ ఓటేశారని రైతులను ఐదేళ్లు గ్రామం నుంచి బహిష్కరించడాన్ని లోకేశ్ తప్పుబట్టారు. తమ కార్యకర్తలపై ఇప్పటి వరకు 100కు దాడులు చేయడమేనా వైసీపీ చెప్పిన రాజన్న రాజ్యమని లోకేశ్ ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే స్పందించి ఇకనైనా ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పోలీస్ శాఖను కోరారు. నెల్లూరు వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదల గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.





Untitled Document
Advertisements