ఎట్టకేలకు వీడిన ఎన్నారైల హత్య మిస్టరీ

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 11:44 AM

ఎట్టకేలకు వీడిన ఎన్నారైల హత్య మిస్టరీ

వాషింగ్టన్‌: ఆదివారం అనుమానస్పద రీతిలో మరణించిన భారత సంతతికి చెందిన చంద్రశేఖర్ సుంకర కుటుంబం హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. చంద్రశేఖర్‌రెడ్డి భార్యను, బిడ్డలను కాల్చి చంపి ఆపై తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అమెరికా పోలీసులు ధ్రువీకరించారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వెస్ట్‌డెస్‌ మోయిన్స్‌లో యాష్‌వర్త్‌ రోడ్డు- అస్పెన్‌ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65వ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న సుంకర చంద్రశేఖరరెడ్డి (44), ఆయన భార్య లావణ్య (41), కుమారులు ప్రభాస్‌ (15), సుహాన్‌ (10)లు శనివారం తుపాకీ తూటాల గాయాలతో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ నాలుగు మృతదేహాలకు శవపరీక్ష అనంతరం సోమవారం అమెరికాలోని లోవా రాష్ట్ర పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయుధం కలిగి ఉండేందుకు చంద్రశేఖర్‌రెడ్డికి ప్రభుత్వం అనుమతిచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఆయన ఎక్కడ తుపాకీని కొనుగోలు చేసింది విచారిస్తున్నట్లు వివరించారు. అలాగే ఐటీ నిపుణుడిగా పని చేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి 2018లో 1,05,000 డాలర్లు సంపాదన ఆర్జించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 25న 5,70,000 డాలర్లు వెచ్చించి చంద్రశేఖర్‌రెడ్డి, లావణ్య దంపతులు ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌రెడ్డి ఇలాంటి దుశ్చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకు పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు. అయితే ఈ మరణాలకు ముడిపెట్టి ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అమెరికాలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements