చైనా పట్ల అప్రమత్తమంగా వ్యవహరించాలి!

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 11:44 AM

చైనా పట్ల అప్రమత్తమంగా వ్యవహరించాలి!

బీజింగ్‌: చైనాలోని భారత రాయబారి విక్రమ్‌ మిస్రీ తాజాగా భారత ప్రధాని మోడీకి పలు సూచనలు చేశాడు. ఈ మేరకు చైనాతో భారత్‌కు పెరుగుతున్న వాణిజ్య లోటు రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మారుతున్నదనీ, దాని పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించినట్లు సమాచారం. అయితే మంగళవారం విక్రమ్‌ మిస్రీ ఓ మీడియాతో మాట్లాడుతూ....చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ త్వరలో భారత్‌లో జరపనున్న పర్యటనలో ఇరుదేశాల మధ్య వాణిజ్య సమతుల్యత ప్రధాన చర్చనీయాంశమవుతుందని అన్నారు. ఈ ఏడాది ఇరుదేశాల సంబంధాలలో ఈ పర్యటన కీలకంగా మారుతుందన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యంలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయన్న ఆయన సమీప భవిష్యత్తులో ఇది పదివేల కోట్ల డాలర్ల స్థాయిని అధిగమిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ రకమైన వాణిజ్య లోటు ఆర్థికంగా స్థిరమైనది కాదనీ, దీనిని నివారించేందుకు చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మారే అవకాశమున్నదని ఆయన చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను గురించి ఆయన మాట్లాడుతూ తమ మధ్య కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయన్నారు. ఇది ముఖాముఖి తేల్చుకోవాల్సిన ప్రక్రియ అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రధానిగా నరేంద్రమోడీ తిరిగి ఎన్నిక కావటాన్ని చైనా ప్రభుత్వం స్వాగతించిందని ఆయన వివరించారు. ఇరుదేశాల ప్రభుత్వాల మధ్య వ్యూహాత్మక కమ్యూనికేషన్లు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు. ఇంథన భద్రతపై ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా ద్వైపాక్షిక సహకారంపై ఆధారపడి వుంటుందని ఇరుదేశాలూ ఈ దిశగా అడుగులు వేస్తున్నాయని వివరించారు. ఉగ్రవాద నిరోధానికి ఉమ్మడి చర్యలు అవసరమన్న ఆయన ఈ విషయంలో భారత్‌ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదనీ, దీనిపై చైనా ప్రతినిధులతో సన్నిహిత చర్చలను కొనసాగిస్తున్నామని వివరించారు.





Untitled Document
Advertisements