ఆఫ్గనిస్తాన్ ని తేలిగ్గా తీసుకోము .. ప్రతి మ్యాచ్ కీలకమే

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 11:36 AM

లండన్: ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకుంటున్నట్టు వచ్చిన వార్తలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొట్టి పారేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేమన్నాడు. ప్రతి జట్టులోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉంటారని, వారు విజయం కోసం సర్వం ఒడ్డుతారన్నాడు. అఫ్గాన్‌లో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదన్నాడు. తమదైన రోజు ఎంతటి పెద్ద జట్టునైనా ఓడించే సత్తా ఆ జట్టుకు ఉందన్నాడు. మహ్మద్ నబి, ముజీబుర్ రహ్మాన్, రషీద్ ఖాన్‌లతో అఫ్గాన్ టోర్నీలో పాల్గొంటున్న ఏ జట్టుకు తీసిపోదన్నాడు. పరిస్థితులు కలిసి వస్తే పెద్ద జట్లను సయితం ఓడించడం ఖాయమన్నాడు.

కాగా, అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌ను భారత జట్టు తేలిగ్గా తీసుకుంటుందని, అందుకే భారత ఆటగాళ్లు షికార్లు చేస్తున్నారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రం వ్యాఖ్యానించాడు. దీనిపై కోహ్లి ఈ విధంగా స్పందించాడు. ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో గడిపినంత మాత్రాన అఫ్గాన్ మ్యాచ్‌నే తేలిగ్గా తీసుకుంటున్నారని భావించడం సరికాదన్నాడు. పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం తగినంత విశ్రాంతి లభించడం వల్లే క్రికెటర్ల తమ కుటుంబ సభ్యులతో కొంత కాలాన్ని గడిపేందుకు బిసిసిఐ అనుమతి ఇచ్చిందన్నాడు. అందువల్లే కొందరు క్రికెటర్లు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారన్నాడు. తాను కూడా భార్యతో కలిసి సేద తీరానని కోహ్లి స్పష్టం చేశాడు. కాగా, ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌ను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్నాడు. ఏ మ్యాచ్‌ను కూడా తక్కువ చేసి చూడడం లేదన్నాడు.

కచ్చితమైన ప్రణాళికతో వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నామని, అన్ని మ్యాచుల్లో గెలవడమే లక్షంగా పెట్టుకున్నామని కోహ్లి పేర్కొన్నాడు. రానున్న మ్యాచుల్లోనూ విజయం సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అఫ్గాన్ మ్యాచ్ కోసం జట్టు ఆటగాళ్లందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంటామని కోహ్లి స్పష్టం చేశాడు.

Untitled Document
Advertisements