టిక్‌టాక్ మోజులో చెరువులో మునిగి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 06:47 PM

గతంలో సెల్ఫీ ఎందరి ఉసురో తీసింది. చాలామంది సెల్ఫీ మాయలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు దాని ప్లేస్‌లో టిక్‌టాక్ యాప్ వచ్చింది. ఈ యాప్ వల్ల చాలామంది ఎక్కడబడితే అక్కడ వీడియోలు తీసుకుంటున్నారు. లైకులు, కామెంట్ల మాయాలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలా టిక్‌టాక్ మోజులో పడిన ఓ యువకుడు చెరువులో మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామ శివారులోని తుమూర్ చెరువు వద్ద చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా, కోహిర్‌ మండలం, సజ్జాపూర్‌ గ్రామానికి చెందిన కరణప్ప, బాలామణి దంపతుల కుమారుడు నర్సింహ(22) అక్కడ పనులు లేకపోవడంతో నగరానికి వలస వచ్చాడు. దూలపల్లిలో ఉంటూ ఎర్రగడ్డలోని ఓ పళ్ల దుకాణంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన పెద్దమ్మ కొడుకు అయిన ప్రశాంత్‌ వచ్చాడు. ఇద్దరూ కలిసి సరదాగా దూలపల్లిలోని తూమార్‌ చెరువు వద్దకు వెళ్లారు.

అక్కడికి వెళ్లగానే నర్సింహకు టిక్‌టాక్ వీడియోలు చేయాలనిపించింది. వెంటనే అతడు నీళ్లలోకి దిగి ప్రశాంత్‌ను వీడియో తీయమని చెప్పాడు. ఇంతలో నీళ్లల్లో వున్న నర్సింహ లోతుగా ఉన్న గుంతలో పడిపోయాడు. ప్రశాంత్‌ అతడిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వెంటనే గ్రామంలోకి పరుగెత్తి కొంతమంది గ్రామస్థులను తీసుకొచ్చాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నీటిలో గల్లంతైన నర్సింహ మృతదేహాన్ని పోలీసులు బుధవారం వెలికి తీశారు. బషీరాబాద్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కొడుకు అర్థాంతరంగా మరణించడంతో అతని తల్లి బాలామణి కన్నీరు మున్నీరవుతోంది. నర్సింహా తండ్రి కరణప్ప అతడి చిన్నతనంలోనే మృతి చెందాడు.

Untitled Document
Advertisements