ధోనితో మాట్లాడేదెవరు!

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 07:44 PM

ధోనితో మాట్లాడేదెవరు!

ప్రపంచకప్ టోర్నీ మధ్యలో ప్రారంభమయిన ధోని రిటైర్మెంట్ వివాదం ప్రపంచకప్ టోర్నీ ముగిసిన ఇన్ని రోజులైనా ఎటూ తేలడంలేదు. అయితే ఈ సందిగ్ధానికి ఎవరో ఒకరు తెరదించాలని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ కిరణ్ మోర్ సూచించాడు. ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కి ధోనీ వీడ్కోలు పలుకుతాడని అంతా ఊహించారు. కానీ.. ఈ మాజీ కెప్టెన్ మిన్నకుండిపోవడంతో.. సెలక్టర్లు, బీసీసీఐతో పాటు టీమిండియా మేనేజ్‌మెంట్‌ కూడా ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతోంది. వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత్ జట్టుని శుక్రవారం సెలక్టర్లు ప్రకటించాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ ధోనీ‌కి జట్టులో స్థానంపై క్లారిటీ రాలేదు. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ఈ 38 ఏళ్ల ఫినిషర్.. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాలని కొందరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంబటి రాయుడ్ని పక్కన పెట్టడం, నెం.4 బ్యాట్స్‌మెన్‌పై పరిణతి లేని ఆలోచనల కారణంగా సెలక్టర్లపై ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. రిషబ్ పంత్‌ లాంటి యువ క్రికెటర్లను పక్కన పెట్టి ధోనీ‌కి టీమ్‌లో చోటిచ్చే సాహసం సెలక్టర్లు చేయకపోవచ్చు. ధోనీ రిటైర్మెంట్‌ జాప్యంపై తాజాగా దిలీప్ కిరణ్ మోర్ మాట్లాడుతూ ‘జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శనని సమీక్షించడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడం సెలక్టర్ల ప్రధాన విధి. టీమ్‌లోని ఆటగాళ్లు ఏ ఏ స్థానాలకి సరిపోతారో ఫస్ట్ సెలక్టర్లకి క్లారిటీ ఉండాలి. అయితే ఇక్కడే సెలక్టర్లు.. జట్టులోని ఆటగాళ్లలో అభద్రతాభావం పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇక ధోనీ విషయం అంటారా..? భవిష్యత్‌ ప్రణాళికలపై ఎవరైనా స్వయంగా అతనితో మాట్లాడితే మంచిది. ధోనీ నిర్ణయాల్ని గౌరవిస్తూనే.. టీమ్‌ బలోపేతానికి ఏం చేయాలనుకుంటారో..? అతనికి వివరించాలి. సందిగ్ధ సమయాల్లో సెలక్టర్లు, ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ చాలా కీలకం’ అని వెల్లడించాడు.





Untitled Document
Advertisements