అరుదైన రికార్డుల ముంగిట...ఇండియన్ బౌలర్, బ్యాట్స్మెన్

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 03:58 PM

అరుదైన రికార్డుల ముంగిట...ఇండియన్ బౌలర్, బ్యాట్స్మెన్

భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికార్డ్స్‌కి దగ్గర్లో ఉన్నారు. బుధవారం రాత్రి వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగే మూడో వన్డే‌లో టీమిండియా ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతకం సాధిస్తే.? శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య సరసన నిలవనున్నాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొడితే.. భారత్ తరఫున అరుదైన ఘనత సాధించనున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదిన రోహిత్ శర్మ.. వెస్టిండీస్ టూర్‌లో మాత్రం ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్‌లాడి ఒక్క అర్ధశతకం మాత్రమే సాధించాడు. దీంతో.. సెంచరీ కోసం నిరీక్షిస్తున్న రోహిత్ శర్మ ఈరోజు బ్యాట్ ఝళిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం 27 వన్డే శతకాలతో దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హసీమ్ ఆమ్లా సరసన ఉన్న రోహిత్.. మూడో వన్డేలో సెంచరీ సాధిస్తే..? ఆమ్లా‌ని అధిగమించడంతో పాటు 28 శతకాలతో ఉన్న జయసూర్య సరసన నిలవనున్నాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం 53 వన్డేల్లో 96 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఈ రోజు మ్యాచ్‌లో ఈ స్పిన్నర్ మరో 4 వికెట్లు పడగొట్టగలిగితే..? భారత్ తరఫున వేగంగా ఈ మైలురాయిని అందుకున్న బౌలర్‌గా నిలుస్తాడు. వెస్టిండీస్ జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. కుల్దీప్‌కి ఈ రికార్డు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.





Untitled Document
Advertisements