త్వరలో సౌదీ పర్యటన

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 10:57 AM

త్వరలో సౌదీ పర్యటన

దేశ ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సౌదీ అరేబియా రాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అవుతారు. సౌదీ రాజధాని రియాద్‌లో ఏర్పాటు చేయనున్న గల్ఫ్ దేశాల ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో కూడా ఆయన పాల్గొననున్నారు. అయితే సౌదీ అరేబియా పర్యటనపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రధాని సౌదీ పర్యటనకు వెళుతున్నారని తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సౌదీలో పర్యటించి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. సౌదీలో పర్యటనలో అజిత్ దోవల్ ఆదేశ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయి పలు ద్వైపాక్షిక అంశాలు చర్చించారు. అదే సమయంలో జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన వివరించడం జరిగింది. ఇదే విషయమై స్పందించిన సౌదీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ అంశంలో భారత్‌ పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో పర్యటించడం ఇది రెండో సారి అవుతుంది. 2016లో చివరిసారిగా ఆయన రియాద్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆదేశ అత్యున్నత పురస్కారంను మోడీ అందుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ రాజు మోహ్మద్ బిన్ సల్మాన్ భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఇరుదేశాల మధ్య స్నేహం బలోపేతం దిశగా కొన్ని వ్యూహాత్మక చర్చలు జరిగాయి. వేర్పాటువాదం, ఉగ్రవాదంలపై ఇరు దేశాలు చర్చించాయి. ప్రపంచంలోనే ఆయిల్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా... రిఫైనింగ్, ఎనర్జీ, మానవవనర రంగాల్లో 100 బిలియన్ అమెరికా డాలర్లను పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. అదే సమయంలో భారత్‌లోని పలు సంస్థలతో సౌదీ అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఆర్మ్‌కో భాగస్వామి అయ్యేందుకు చర్చలు జరుపుతోంది.





Untitled Document
Advertisements