ప్రజలపై సమ్మె ఎఫెక్ట్

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 12:20 PM

ప్రజలపై సమ్మె ఎఫెక్ట్

రాష్ట్రంలో ఆర్టిసి కార్మికుల సమ్మె శనివారం ఉదయం ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు బంద్ కావడంతో తమతమ గమ్య స్థానాలను చేరుకునేందుకు ప్రజలు ప్రైవేటు వాహనాలను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు, ప్రైవేటు వాహన దారులు ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఆర్ టిసి సమ్మెను బూచీగా చూపి ఆటో డ్రైవర్లు, ప్రైవేటు వాహనదారులు ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ పూట ఆర్ టిసి కార్మికులు సమ్మె చేస్తుండడంతో తమతమ ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో సీట్లు దొరక్క నిలబడే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ నగరంలో ప్రైవేటు డ్రైవర్లను, కండక్టర్లను పెట్టి బస్సులు నడిపిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రోడ్లపై మాత్రం బస్సులు కనిపించడం లేదు. సమ్మె నివారణ కోసం ప్రభుత్వం ఆర్ టిసి కార్మిక సంఘాల జెఎసి నేతలతో పలు మార్లు చర్చలు చేసినప్పటికీ, ఆ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆర్ టిసి సమ్మె అనివార్యమైంది. తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్ టిసి కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. మరో వైపు కార్మిక సంఘాలతో ఇకపై చర్చలు ఉండవని, శనివారం సాయంత్రం వరకు విధుల్లో చేరకపోతే, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఆర్ టిసి కార్మికులను ప్రభుత్వం హెచ్చరించింది. అయినప్పటికీ సంఘటితంగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ఆర్ టిసి కార్మికుల సమ్మె ఎన్ని రోజులు జరుగుతుందో తెలియక సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్ టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించి, సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Untitled Document
Advertisements