అయోధ్య వివాదానికి ముగింపు...సుప్రీంకోర్టులో నేడు ఆఖరి వాదనలు!

     Written by : smtv Desk | Wed, Oct 16, 2019, 07:15 AM

అయోధ్య వివాదానికి ముగింపు...సుప్రీంకోర్టులో నేడు ఆఖరి వాదనలు!

నేడు అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఆఖరి వాదనలను విననుంది. ఇప్పటికే 39 సార్లు అయోధ్య రామమందిరం బాబ్రీమసీదు భూవివాదంలో కోర్టు వాదనలు విని ఇక చివరి సారిగా అంటే 40వ సారిగా అత్యున్నత న్యాయస్థానం వాదనలు విననుంది అని తాజాగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇక అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు కేవలం తీర్పు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా జరుగుతుందని భావిస్తున్నారు. అయోధ్య భూవివాదం కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది. ఆగష్టు 6 నుంచి రోజువారీగా ఈ విచారణను ఈ బెంచ్ చేపడుతోంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు హిందూ సంఘాలు ముస్లిం సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. 2.77 ఎకరాల స్థలంను ఆలయ ప్రధాన పూజారి రామ్‌లల్లా, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్‌బోర్డులకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాలు చేస్తూ 2011లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక అప్పటి నుంచి కోర్టులోనే కేసు మగ్గుతూ వస్తోంది. 1992 డిసెంబర్ 6వ తేదీన 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఈ వివాదం హిందూ ముస్లింల మధ్య గొడవగా మారింది. అయితే అత్యున్నత న్యాయస్థానం మాత్రం అక్టోబర్ 17న వాదనలు వినేందుకు చివరిరోజని ప్రకటించింది. ఇక తీర్పు నవంబర్ 4 లేదా 5వ తేదీల్లో వెలువడే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements