బస్సు రోకో..డిపోల ఎదుట బైఠాయించిన కార్మికులు

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 07:37 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బస్సు రోకోకు ఆర్‌టిసి జెఎసి పిలుపుతో శనివారం కార్మికులు వేకువజాము నుంచే డిపోల ఎదుట నిరసనకు దిగారు. కార్మికుల చర్యలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని.. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎంప్లాయిస్ ఆఫీసులో దీక్షకు ఆర్‌టిసి జెఎసి పిలుపునిచ్చిన నేపథ్యంలో యూనియన్ ఆఫీసు ఎదుట భారీసంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈయూ ఆఫీసులో నిరవధిక దీక్షకు జెఎసి నేతలు యత్నించారు.ఆర్‌టిసి కార్మికుల జెఎసి తలపెట్టిన బస్‌రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కార్మికులు నిరసన కార్యక్రమానికి పోలీసు శాఖ నుంచి అనుమతులు రాలేదు. దీంతో ఆర్‌టిసి జెఎసి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.. జెఎసి కోకన్వీనర్ రాజిరెడ్డిని సైతం ఎల్‌బినగర్‌లో గృహ నిర్బంధం చేశారు. నేతల ఇంటి వద్ద పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. ఈ నేపథ్యంలో ఆర్‌టిసి కార్మికులు కూడా నేతల ఇళ్ల వద్దకు చేరుకుని మద్దతు పలికారు.ముషీరాబాద్ డిపో వద్ద డ్రైవర్ సైదులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఎదుట ధర్నా చేసిన ఆర్‌టిసి కార్మికులు, అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్‌టిసి జెఎసి, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు బృందాలుగా ఏర్పడి ఆందోళనలు చేపట్టారు. మొదట డిపో ఎదుట ధర్నా చేసి బస్సులను అడ్డుకున్న ఆర్‌టిసి జెఎసి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.సిపిఎం, సిపిఐ, టిపిఎఎఫ్, ఎంఆర్‌పిఎస్ బిసి సంక్షేమ సంఘం నాయకులు కలిసి బస్టాండ్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాతబస్తీ ఫారూఖ్‌నగర్ డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 15 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఫలక్‌నుమా బస్సు డిపో ఎదుట ఆందోళన చేస్తున్న 40 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.ఆర్‌టిసి జెఎసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్‌లో బస్సు రోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసి నాయకులు ప్రభాకర్, దేవారంలతో పాటు జెఎసి నేత భాస్కర్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వామపక్ష నాయకులు రమేష్ బాబు, నూర్జహాన్ దండి వెంకట్‌ను కూడా అరెస్టు చేసి మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిద్దిపేటలో డిపో ఎదుట బైఠాయించిన కార్మికులు.. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కార్మికులు ఆందోళన బాట పట్టారు. వేకువజామునే డిపోల వద్ద కార్మికులు, అఖిలపక్ష నేతలు బైఠాయించారు. డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుపడ్డారు. ఖమ్మం డిపో ఎదుట ఆందోళనకు దిగిన అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిడిపి, న్యూడెమోక్రసి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు నిరాహారదీక్ష కొనసాగిస్తానని ఆర్‌టిసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. అశ్వత్థామరెడ్డి ఇంటిలోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఊర్మిలానగర్‌లో ఆయన నివాసంలోనే దీక్షకు దిగారు. పోలీసులు అరెస్టు చేస్తే పోలీస్‌స్టేషన్‌లోనూ దీక్ష కొనసాగుతుందని తెలియజేశారు. అర్థరాత్రి వేళ తన ఇంటిని పోలీసులు చుట్టుముట్టి భయభ్రాంతులుకు గురిచేశారంటూ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు.బస్సు రోకోకు ఎలాంటి అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా పలువురు నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. బస్ భవన్‌తో పాటు డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు వర్తిస్తుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా ఏర్పడిన ఆందోళన చేయొద్దని, బస్సులు రాకపోకలు అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు. నగరంలో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. అందరూ నిబంధనలు పాటించాలని అంజనీకుమార్ సూచించారు.అక్టోబర్ 5న మొదలైన సమ్మె శనివారంతో 43వ రోజుకు చేరింది. 2011లో సెప్టెంబర్ 13న ప్రారంభమైన సకల జనుల సమ్మె అక్టోబరు 24 వరకు 42 రోజుల పాటు కొనసాగింది. 2001లో ఆర్‌టిసి కార్మికులు 24 రోజుల పాటు సమ్మె చేశారు. ఇప్పుడు 26 డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్‌టిసి కార్మికులు అక్టోబర్ 5న ప్రారంభించిన సమ్మె శనివారంతో 43 రోజులు పూర్తిచేసుకున్నది. ఆర్‌టిసి చరిత్రలోనూ ఇదే పెద్ద సమ్మెగా నిలిచింది.





Untitled Document
Advertisements