తిరుపతి లడ్డూ ధర పెరగలేదు: టిటిడి

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 05:44 PM

తిరుపతి లడ్డూ ధర పెరగలేదు: టిటిడి

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం ధరలను టిటిడి పెంచిందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ సామాన్య భక్తులకు అందజేస్తున్న ఉచిత లడ్డూ ప్రసాదాన్ని యథాతథంగా ఉంచి.. ఆ పైన కొనుగోలు చేసే ఒక్కో లడ్డూను రూ.50కి విక్రయించేందుకు నిర్ణయించారన్న వాదనలు వినిపించాయి.మార్కెట్ ధర ప్రకారం లడ్డూ తయారీకి టీటీడీ సుమారు రూ. 40 ఖర్చు చేస్తోంది. లడ్డూలపై భక్తులకు ఇస్తున్న రాయితీతో భారీ నష్టం వస్తోందని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం. అధికారుల సమీక్షలో ఈ విషయంపై చర్చించినట్లు వార్తలొచ్చాయి. భక్తులకు అందజేస్తున్న రాయితీని తొలగించాలని నిర్ణయానికి వచ్చారని.. అదే విషయాన్ని టీటీడీ బోర్డుకు నివేదించనున్నట్లు ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరల పెంపు విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. లడ్డూ ధరలు పెంచుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అవన్నీ వదంతులేనని తేల్చిచెప్పారు. లడ్డూ ధరలు పెంచే ఆలోచన టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా వదంతులు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు పెంచడం లేదని.. వదంతులను నమ్మవద్దని వైవీ సుబ్బారెడ్డి భక్తులకు వవిజ్ఞప్తి చేశారు. అలాగే తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి ఆదివారం పరిశీలించారు.







Untitled Document
Advertisements