ఏకంగా రూ.2,450 పడిపోయిన పసిడి ధర

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 03:13 PM

ఏకంగా రూ.2,450 పడిపోయిన పసిడి ధర

బంగారం ధర పడిపోతూనే వస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర మంగళవారం మార్నింగ్ సెషన్‌లో 10 గ్రాములకు 0.03 శాతం తగ్గుదలతో రూ.37,570కు క్షీణించింది. ఐదు రోజుల్లో బంగారం ధర మొత్తంగా 10 గ్రాములకు ఏకంగా రూ.750 మేర పడిపోయింది. దీంతో పుత్తడి వెలవెలబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దేశీ ఎంసీఎక్స్ మార్కెట్‌లో సెప్టెంబర్ నెల ఆరంభంలో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. అప్పటి నుంచి చూస్తే.. అంటే రూ.40 వేల మార్క్‌తో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర ఏకంగా రూ.2,450 పడిపోయింది. పసిడి బాటలోనే వెండి కూడా నడుస్తోంది. బంగారం ధర పడిపోతూ వస్తుంటే.. వెండి ధర కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ వస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో కేజీ వెండి ధర 0.09 శాతం తగ్గింది. రూ.43,465 స్థాయికి దిగొచ్చింది. ఇక వెండి ధర సెప్టెంబర్ నెలలో కేజీకి ఏకంగా రూ.50 వేల స్థాయికి వెళ్లింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర స్తబ్దుగా ఉందని చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. చైనా దిగుమతులపై అమెరికా కొత్త టారిఫ్‌లు డిసెంబర్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. టారిఫ్‌లు అమలులోకి వస్తాయా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. అందుకే ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉన్నారు. బంగారం ధర ఔన్స్‌కు 1460.95 డాలర్ల సమీపంలో ఉంది. పసిడి ధరపై రూపాయి ప్రభావం కూడా పడింది. రూపాయి బలపడుతూ రావడం బంగారంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాగే వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు కూడా పసిడిపై ఒత్తిడి పెంచుతున్నాయని ఎబాన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అభిషేక్ బన్సాల్ తెలిపారు. గ్లోబల్ ట్రేడర్స్ అమెరికా ఫెడరల్ రిజర్వు మీటింగ్ అంశంపై కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఫెడ్ రెండు రోజుల మీటింగ్ ఈ రోజు ప్రారంభమౌతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రెండు రరోజుల్లో తెలిసిపోతుంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది ఏకంగా 14 శాతం ర్యాలీ చేసింది. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల సరళ పాలసీ విధానాలను అనుసరించడం కూడా పసిడికి కలిసొచ్చింది. అలాగే ఇవి బంగారం కొనుగోలు చేయడం కూడా పాజిటివ్ ఎఫెక్ట్ చూపింది. భారత్‌లో కూడా బంగారం ధర పరుగులు పెట్టింది. ఈ ఏడాది పసిడి ధర ఏకంగా 19 శాతం మేర ర్యాలీ చేసింది. గ్లోబల్ పెరుగుదల కన్నా భారత్‌లోనే బంగారం ధర ఇంకా ఎక్కువ పెరగడం గమనార్హం. పసిడి దిగుమతులపై సుంకాలు పెంచడం, రూపాయి పడిపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం. 2019 చివరకు వచ్చేశాం. బంగారం ధర ఈ ఏడాది పరుగులు పెట్టింది. మరి కొత్త సంవత్సరంలోని అడుగు పెట్టబోతున్నాం. మరి వచ్చే ఏడాది కూడా పసిడి మెరుపులు ఉంటాయా? ఈ ప్రశ్నకు సమాధానం.. అవుననే చెప్పొచ్చు. మార్కెట్ అనలిస్ట్‌లు బంగారం ధర వచ్చే ఏడాది కూడా పరుగులు పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. గోల్డ్‌మన్ శాక్స్, యూబీఎస్ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలు బంగారం ధర ఔన్స్‌కు 1,600 డాలర్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నాయి. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.



















Untitled Document
Advertisements