సిరీస్ ను వదులుకోం!

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:36 AM

వెస్టిండీస్ జట్టుపై టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా పోలార్డ్ కెప్టెన్సీని కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపిఎల్)తో పోలార్డ్ సామర్థ్యం, ఆలోచనలగురించి క్షుణ్ణంగా తెలుసన్నాడు. గత సీజన్‌లో తన గైర్హాజరీ నేపథ్యంలో ముంబయి జట్టుకు పోలార్డ్ నాయకత్వం వహించాడని, ఆ సమయంలో అతని వ్యూహాలు, గెలవాలన్న తపన, మైదానంలో ఆటగాళ్లను సక్రమంగా వినియోగించుకునే తీరు దగ్గరుండి గమనించానని చెప్పాడు.కెప్టెన్‌గా ఉన్నప్పుడు పోలార్డ్ ఎంతో ఆత్మ విశ్వాసంతో తోటి ఆటగాళ్లపట్ల చాలా నమ్మకంతో వ్యవహరిస్తాడన్నాడు. టి20ల లో విండీస్ అనూహ్యమైన జట్టని, ప్రతి ఆటగాడు క్షణా ల్లో మ్యాచ్‌ని మార్చివేయగలడని ప్రశంసించాడు. అయి తే తాము ఏ జట్టుకూ భయపడబోమని రోహిత్ స్పష్టం చేశాడు. ‘వెస్టిండీస్ చాలా అనూహ్యమైన జట్టు. టి20 లలో చాలా అనూహ్యంగా ఆడుతుంది. ముఖ్యంగా పోలార్డ్ నేతృత్వంలో ఆ జట్టు చాలా పరిణతి చెందింది. ఆ జట్టులో చాలామంది పవర్ హిట్టర్లు ఉన్నారు.ఆ తరుణంలో బౌలర్లకు పెద్ద పరీక్షే. అయితే మేము ఏ జట్టుకూ భయపడం. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే మేము గెలుస్తాం.అయితే మాకంటే వారి ప్రణాళికలు మెరుగ్గా ఉంటే వారు గెలుస్తారు’ అని అన్నాడు. ‘ఇక తొలి రెండు మ్యాచ్‌లలో వారి ప్రదర్శన అద్భుతంగా ఉంది. హైదరాబాద్ మ్యాచ్‌లో కోహ్లీసాయంతో భారీ స్కోరును చేజ్ చేయగలిగాం. అయితే తిరువనంతపురం లో చతికిలపడ్డాం. ఆ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లో చాలా తప్పులు చేశాం. ఆ లోపాలన్నిటిని సరి చేసుకుని నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయం కోసం బరిలోకి దిగుతాం. సిరీస్ సాధిస్తామనే విశ్వాసం మాకు ఉంది’ అని రోహిత్ చెప్పాడు.





Untitled Document
Advertisements