ఈశాన్యాన పౌరసత్వ సవరణ...వామపక్ష సంస్థల బంద్‌తో స్తంభించిన జనజీవనం

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:57 AM

పౌర సత్వ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించడాన్ని ప్రతిఘటిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు, వామపక్ష ప్రజాస్వామ్య సంస్థలు నిర్వహించిన ఆందోళనలతో సంచలనం సృష్టించారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఇఎస్‌ఓ) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలతో అస్సాం బ్రహ్మపుత్ర లోయలో జనజీవనం స్తంభించింది. ఈ ఆం దోళన మాత్రమే కాక ఎస్‌ఎఫ్‌ఎల్, డివైఎఫ్‌ఎల్, ఐద్వా, ఎఐఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఎ వంటి వామపక్ష సంస్థలు బంద్ పిలుపు నిచ్చాయి. గువాహతిలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఊరేగింపులు జరిగాయి. విభజన చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. అసోంలో అసెంబ్లీ, సెక్రెటేరియట్ భవనాల సమీపంలో ఆందోళనకారులు ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వారికి, భద్రతాదళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి. డిబ్రూగర్ జిల్లాలో దులియాజన్‌లో ఆయిల్ ఇండియా వర్కర్లను కార్యాలయంలోకి వెళ్లనీకుండా బంద్ మద్దతుదారులు అడ్డుకున్నప్పుడు వారికి, సిఐఎస్‌ఎఫ్ సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ఆందోళనకారులు గాయపడ్డారు. నిరసనకారులు రైలు పట్టాలను అడ్డగించడంతో అసోంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందిన రైల్వేల ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, బెంగాలీలు ఎక్కువగా ఉన్న బారక్ వ్యాలీలో సమ్మె ప్రభావం అం తగా లేదు. ధలాల్ జిల్లాలో ఎన్‌ఇఎస్‌ఓ బంద్‌లో గిరిజనేతరులు నిర్వహించే చాలా షాపుల్ని దగ్ధం చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే మనూఘాట్‌లో జరిగిన సంఘటనలో ఎవరూ గాయపడలేదని, భద్రతా దళాల్ని నియమించినా గిరిజనేతరులు భయానికి గురయ్యారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా ఉండగా వివిధ సంస్థల సమ్మె నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో 48 గంటలపాటు ఇంటర్‌నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. ధలాయ్, పశ్చిమ త్రిపుర, ఖోవాయ్ జిల్లాల్లో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. ఆఫీసుల్లో హాజరు అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్రమంతటా రైళ్ల రాకపోకలు స్తంభించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు, విద్యాసంస్థలు, మార్కెట్లు మూతబడ్డాయి. రోడ్లపై వాహనాలు కనిపించలేదు. ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (ఎఎంఎస్‌యు) ఇచ్చిన బంద్ పిలుపుతో మణిపూర్‌లో పూర్తిగా బంద్ జరిగింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఆందోళనకారులు వాహనాల్ని తగలబెట్టారు.







Untitled Document
Advertisements