ధావన్, కేఎల్ రాహుల్ ఫెయిల్.. ప్రత్యామ్నాయం..?

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 06:19 PM

ధావన్, కేఎల్ రాహుల్ ఫెయిల్.. ప్రత్యామ్నాయం..?

భారత యువ ఓపెనర్ పృథ్వీ షా డబుల్ సెంచరీతో చెలరేగాడు. వడోదర వేదికగా బరోడాతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబయి తరఫున ఆడిన పృథ్వీ షా 179 బంతుల్లోనే 19 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 202 పరుగులు చేశాడు. దీంతో.. ముంబయి టీమ్ ఇన్నింగ్స్‌ని 409/4తో డిక్లేర్ చేసింది. డోపింగ్ టెస్టులో ఫెయిలై 8 నెలలు నిషేధం ఎదుర్కొన్న ఈ యువ ఓపెనర్ ఇటీవల మళ్లీ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు.

దేశవాళీ క్రికెట్‌లో రికార్డుల మోత

మ్యాచ్‌లో కేవలం 174 బంతుల్లోనే 200 పరుగుల మైలురాయిని అందుకున్న పృథ్వీ షా.. దేశవాళీ క్రికెట్‌లో ముంబయి తరఫున సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ 2015లో శ్రేయాస్ అయ్యర్ 175 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన రికార్డ్ అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా ఆ రికార్డ్‌ని పృథ్వీ షా కనుమరుగు చేశాడు. ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ.. 2009లో 185 బంతుల్లో డబుల్ సెంచరీ, సచిన్ టెండూల్కర్.. 1998లో 188 బంతుల్లో 200 పరుగులతో ఉన్నారు. మొత్తంగా.. గడిచిన రెండు దశాబ్దాలలో ముంబయి టీమ్ తరఫున వేగంగా డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా పృథ్వీ షా నిలిచాడు.

​పృథ్వీ షా స్థానంలో జట్టులోకి వచ్చి సెటిలైపోయిన మయాంక్

భారత జట్టులో గత ఏడాది అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ.. ఈ ఏడాది డోపింగ్ టెస్టులో ఫెయిలైన అతనిపై బీసీసీఐ 8 నెలలు నిషేధం విధించగా.. గత నెల చివర్లో అతను మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తాజాగా డబుల్ సెంచరీతో తన పునరాగమనాన్ని ఈ యువ ఓపెనర్‌ ఘనంగా చాటుకున్నాడు.

శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఫెయిల్.. ప్రత్యామ్నాయం..?

భారత జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం గట్టి పోటీ నడుస్తోంది. రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఓపెనర్‌గా కొనసాగుతుండగా.. అతనికి సరైన జోడీ కోసం టీమిండియా అన్వేషిస్తోంది. ఇటీవల టెస్టుల్లో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా నిలకడగా రాణిస్తున్నాడు. కానీ.. వన్డే, టీ20ల్లో మాత్రం ఇంకా భారత్‌కి నిరీక్షణ తప్పలేదు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లతో టీమిండియా నెట్టుకొస్తోంది. వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌ కోసం ధావన్ స్థానంలో మయాంక్‌కి సెలక్టర్లు తాజాగా ఛాన్స్ ఇవ్వగా.. ఇప్పుడు డబుల్ సెంచరీతో రేసులోకి పృథ్వీ షా కూడా వచ్చాడు.





Untitled Document
Advertisements