400 ఏళ్ల కిందటి ఆలయం...ఆ గుడిలో అమ్మవారి విగ్రహాలు మాట్లాడతాయి

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 08:19 PM

400 ఏళ్ల కిందటి ఆలయం...ఆ గుడిలో అమ్మవారి విగ్రహాలు మాట్లాడతాయి

ఈ ఊరిలో చీకటి పడితే చాలు.. ఎక్కడి నుంచో మాటలు వినిపిస్తుంటాయి. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ప్రతి రోజు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొనేందుకు గ్రామస్తులు చాలాసార్లు ప్రయత్నించారు. చివరికి గుడి నుంచి వస్తున్నాయని తెలుసుకుని లోపలికి వెళ్లి చూశారు. కానీ, ఎవరూ లేరు. మాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. చివరికి ఆలయంలోని గర్భగుడిలో ఉండే విగ్రహాల నుంచి వస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయం పరిశోధకులు సైతం తెలిసింది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోడానికి రంగంలోకి దిగారు. మనుషులు లేకుండా మాటలు వినిపించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

*400 ఏళ్ల కిందటి ఆలయం ఇది:

బీహార్‌.. తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు. రాజుల కాలం నుంచి ఈ విద్య తరతరాలకు అందుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 400 ఏళ్ల కిందట బస్తర్‌లో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయాన్ని నిర్మించారు. తాంత్రిక శక్తులను పొందడానికి, తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఆ ఆలయం.. రాత్రి వేళల్లో మాత్రం గుండె దడ పెంచుతుంది.

*ఆ మాటలు ఎక్కడి నుంచి?:

ఆ ఆలయాన్ని నిర్మించిన రాచ కుటుంబికులకు, స్థానిక ప్రజలకు రాత్రి వేళల్లో ఏవో మాటలు వినిపించేవి. ఎంతో స్పష్టంగా వినిపించే ఆ మాటలను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అలాగే, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా చాలామందికి అర్థం కాలేదు. ఆలయం నుంచి పూజారులే మాట్లాడుతున్నారేమో అని భ్రమపడేవారు. అయితే, పూజారులు ఆ మాటలు తమవి కావని, తాళాలు వేసి బయటకు వచ్చిన తర్వాతే మాటలు బయటకు వినిపిస్తున్నాయని చెప్పారు. అప్పటి నుంచి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలే మాట్లాడుతున్నాయని ప్రచారం సాగుతోంది.

*చేతులెత్తేసిన పరిశోధకులు:

ఈ ఆలయం గురించి తెలుసుకున్న ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఈ మిస్టరీని తెలుసుకోవడం విఫలమయ్యారంటే.. అది నిజంగా చిత్రమే. ఇప్పుడే కాదు.. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, చిన్న ఆధారం కూడా దొరకలేదు. అయితే, ఆలయ గర్భ గుడి నుంచి గుర్తుపట్టలేని మాటలు వినిపించాయని పరిశోధకులు తెలిపారు.

*కలశం లేని ఆలయం ఇది:

సాధారణంగా ఆలయాల నిర్మాణంలో కలశ స్థాపన చేస్తారు. అయితే, ఈ ఆలయాన్ని తాంత్రిక శక్తుల కోసం నిర్మించిన నేపథ్యంలో ఇక్కడ కలశ స్థాపన చేయలేదు. ఈ ఆలయంలో దుర్గాదేవి వివిధ అవతారాల్లో కనిపిస్తుంది. త్రిపురా, ధూమవతి, బగులముఖీ, తారా, కాలీ, చిన్మస్త, శోదాశీ, మాతాంగి, కమలా, ఉగ్ర తార, భువనేశ్వరి తదితర అమ్మవారి విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. రాత్రి వేళల్లో ఈ విగ్రహాలు మాట్లాడుకుంటాయని స్థానికులు చెబుతుంటారు. ఒకప్పుడు ఇళ్ల వరకు ఆ మాటలు వినిపించేవని, ఇప్పుడు ఆలయం సమీపానికి వెళ్తేనే వినిపిస్తున్నాయని తెలుపుతున్నారు. మీకు కూడా ఆ మాటలు వినాలనిపిస్తే తప్పకుండా ఆ ఆలయాన్ని దర్శించండి.

గమనిక: ఆలయ నిర్వాహకులు, స్థానికులు, వివిధ మాధ్యమాలు చెప్పిన వివరాల ఆధారంగా ఈ మిస్టరీ కథనాన్ని అందించామని గమనించగలరు. మూఢ నమ్మకాల ప్రచారం, తప్పుడు కథనాలను అందించే ఉద్దేశంతో కాదని గమనించగలరు.





Untitled Document
Advertisements