భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం

     Written by : smtv Desk | Sun, Dec 22, 2019, 12:56 AM

భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సిఇఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సుందర్ పిచాయ్‌కి భారీగా వేతనం పెరిగింది. ఆయనకు రెండు మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో పాటుగా సంతృప్తికర పని తీరుతో లక్షాలను గనుక చేరుకోగలిగితే 2020నుంచి మూడు సంవత్సరాల పాటు 240 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్ అవార్డు లభించనుంది. అంతేకాకుండా ఆల్ఫాబెట్ షేర్ల విలువ పెరుగుదలకు అనుగుణంగా 90 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు అదనపు బోనస్‌గా లభించనున్నాయి. ఈ విధంగా పనితీరును బట్టి షేర్లను బోనస్‌గా ఇవ్వడం కాలిఫోర్నియా కేంద్రంగా పని చేసే ఆల్ఫాబెట్ సంస్థ చరిత్రలో ఇదే మొదటిసారి. గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్‌లు కంపెనీనుంచి తప్పుకొన్నతర్వాత సుందర్ పిచాయ్ డిసెంబర్ 3న ఆల్ఫాబెట్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మాజీ అధ్యక్షులు లారీ పేజ్, సెర్గే బ్రిన్‌లకు గూగుల్ సంస్థలో ఆరు శాతం వాటాలుండగా సుందర్ పిచాయ్‌కి ఆ రూపంలో పరిహారం ఏమీ లభించలేదు. గూగుల్ సంస్థలో అంతర్గత సంఘర్షణల అణచివేత అనంతరం ఉద్యోగులు, యాజామాన్యం మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ సంవత్సరం జరిగిన ఒక ఉద్యోగుల సమావేశంలో ‘ సిలికాన్ వ్యాలీలో ఎంతో మంది తమ మనుగడ కోసం కష్టపడుతున్నారు. ఈ పరిస్థితిలో పిచాయ్‌కి అంత పారితోషికం అవసరమా?’ అని ఒక ఉద్యోగి ప్రశ్నించాడు. అయితే భారతీయ సంతతికి చెందిన ఈ 47 ఏళ్ల ఇంజనీర్‌కు భారీ ప్యాకేజిలు కొత్తేమీ కాదు. 2016లో సుందర్ 200 మిలియన్ డాలర్లు స్టాక్ అవార్డు రూపంలో పొందారు. 2019లో ఆయన మొత్తం వేతనం 1.9 మిలియన్ డాలర్లు. అదే సంవత్సరం షేర్ల రూపంలో ఇవ్వబోయిన మరో భారీ బోనస్‌ను సుందర్ పిచాయ్ తిరస్కరించడం విశేషం.

Untitled Document
Advertisements