చైనాను వణికిస్తున్న కొత్తరకం వైరస్!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 11:47 AM

చైనాను వణికిస్తున్న కొత్తరకం వైరస్!

చైనాను కొత్తరకం కరోనా వైరస్ వణికిస్తుంది. వుహాన్ సిటీ నుంచి వ్యాపించిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. శనివారం నాటికి 45 మందికి ఈ వైరస్ సోకిందని, వీరిలో ఐదుగురి పరిస్థితి సీరియస్‌గా ఉందని చైనా అధికారులు వెల్లడించారు. కానీ, జనవరి12 నాటికే ఇది సుమారుగా1,723 మందికి సోకి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణులు చెప్తున్నారు. ఒక్క వుహాన్ సిటీలోనే వెయ్యి మందికి పైగా ఇది సంక్రమించి ఉంటుందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చర్లు అంటున్నారు. సెంట్రల్ చైనాలోని వుహాన్ సిటీ నుంచి వివిధ దేశాలకు వెళ్లిన ప్యాసింజర్లకు కూడా ఈ వైరస్ సోకిందని పేర్కొంటున్నారు. థాయిలాండ్ లో ఒకరికి, జపాన్ లో మరొకరికి కొత్త కరోనా వైరస్ సంక్రమించినట్లు ఇదివరకే తేలింది. అయితే, వుహాన్ నుంచి రోజూ3 వేలకు పైగా విదేశీ ప్యాసింజర్లు ఆయా దేశాలకు వెళ్తుంటారని, వాళ్లలో ఇంకా ఎంత మందికి ఈ వైరస్ సోకిందో తెలియాల్సి ఉందని అంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వుహాన్ నుంచి వస్తున్న ప్యాసింజర్లకు అమెరికా హెల్త్ ఆఫీసర్లు శుక్రవారం నుంచే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభించారు. ఆసియాలో థాయిలాండ్, జపాన్‌ సహా ఆరు దేశాలు కూడా ప్యాసింజర్లకు ఎయిర్ పోర్టుల్లోనే టెస్టులు చేస్తున్నాయి. దక్షిణ చైనాలో 2002లో సార్స్ వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభించింది. జ్వరం, తలనొప్పి, తీవ్రమైన న్యుమోనియాతో ఊపిరి ఆడకుండా చేసే ఈ వైరస్ అప్పట్లో 8000 మందికి సోకింది. వారిలో 774 మంది చనిపోయారు. చైనాలో కొత్తగా వెలుగు చూసిన వైరస్ కూడా సార్స్ లాంటిదేనని సైంటిస్టులు వెల్లడించారు. కరోనా వైరస్ ల ఫ్యామిలీలో చాలా రకాల వైరస్‌లున్నాయి. అయితే, సార్స్, మెర్స్‌ సహా ఇప్పటివరకూ ఆరు వైరస్‌లు మాత్రమే మనుషులకు వ్యాపిస్తాయని కనుగొన్నారు. తాజాగా మరో కరోనా వైరస్ కూడా మనుషులకు సోకుతుందని బయటపడింది. అయితే, ఈ కొత్త కరోనా వైరస్ కూడా సార్స్ మాదిరిగానే న్యుమోనియాకు కారణమవుతోందని, కానీ సార్స్ కన్నా తక్కువ ప్రమాదకరమని అంటున్నారు. దీనివల్ల తీవ్రమైన సర్ది, ఆ తర్వాత న్యుమోనియా వస్తోందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పెరిగి చనిపోయే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. వుహాన్ లోని ఓ సీఫుడ్, వైల్డ్ లైఫ్​మార్కెట్ నుంచే ఈ వైరల్ ఇన్ఫెక్షన్‌లు మొదట ప్రారంభమయ్యాయని చైనా అధికారులు భావిస్తున్నారు. అందుకే మరింత మందికి ఈ వైరస్ వ్యాపించకుండా ఉండేందుకని అధికారులు జనవరి1 నుంచే ఆ మార్కెట్‌ను పూర్తిగా మూసివేశారు. అయినా అది కంట్రోల్‌ కావట్లేదు. తీవ్రమైన జ్వరం, వాంతులు, సడెన్ గా కిడ్నీ ఫెయిల్యూర్.. ఈ లక్షణాలతో ఓ అంతుచిక్కని రోగం జమ్మూకాశ్మీర్ లో వెలుగు చూసింది. ఇప్పటికే ఈ రోగం వల్ల 10 మంది పిల్లలు చనిపోయారు. మరో ఆరుగురు నాలుగేళ్లలోపు పిల్లల పరిస్థితి సీరియస్ గా ఉందని, వారిని ఆయా హాస్పిటళ్లలో ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నామని అధికారులు శనివారం వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లా రామ్ నగర్ బ్లాక్ పరిధిలోని 40 కిలోమీటర్ల ఏరియాలోనే ఈ మిస్టీరియస్ డిసీజ్ వ్యాపిస్తోందని గుర్తించారు. చూడటానికి సాధారణ లక్షణాలే కన్పిస్తున్న ఈ వ్యాధి ఏమిటో తెలియడం లేదని చెప్తున్నారు. వ్యాధి ప్రభావిత ప్రాంతంలో డాక్టర్లు, అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని, వ్యాధికి కారణమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జిల్లా అధికారులు తెలిపారు. ఈ ఏరియాలో తాగునీటిని పరీక్షించేందుకు శాంపిళ్లు కూడా సేకరిస్తున్నామని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements