ఐఏఎస్ లు ప్రభుత్వ నిర్ణయాల్లో పాలుపంచుకోకుంటే ఎలా??

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:56 PM

ఐఏఎస్ లు ప్రభుత్వ నిర్ణయాల్లో పాలుపంచుకోకుంటే ఎలా??

ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ నిర్ణయాల్లో పాలుపంచుకోకుంటే.. వారి వల్ల ఉపయోగమేమిటని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఐఏఎస్ అధికారులు ముఖ్య పాత్ర నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవడంలో వారి పాత్ర కీలకమని చెప్పారు. నాగపూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్కరీ, అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘ఖాస్దర్ క్రీడా మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైదానంలో ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి పాజిటివ్ ధోరణి, నిర్ణయాత్మక శక్తి అవసరమన్నారు. నిధులున్నప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోందంటూ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో రూ.17 లక్షల కోట్లకు సంబంధించిన పనులను తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ ఏడాది కనీసం రూ.5 లక్షల కోట్లకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించలేదన్నారు. దీనికి కారణం నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందడమేనని తెలిపారు.

‘ఈసారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కనీసం రూ.5 లక్షల కోట్లు కేటాయించాలనుకున్నాము. నిధుల కొరత లేదు. ఉన్న సమస్య ఏమిటంటే.. నెగటివ్ దృక్ఫథం కారణంగా ప్రభుత్వంలో నిర్ణయాలు చేసే శక్తి లోపించడమే’ అని గడ్కరీ అన్నారు.





Untitled Document
Advertisements