అభిమానం ఎక్కువైంది...నామినేషన్ మిస్ చేసుకున్న ఢిల్లీ సీఎం

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 06:58 PM

అభిమానం ఎక్కువైంది...నామినేషన్ మిస్ చేసుకున్న ఢిల్లీ సీఎం

ఆమ్‌ అద్మీ పార్టీ కార్యకర్తలు చీపుర్లతో హంగామా చేయడంతో ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నామినేషన్ వేయలేకపోయారు. నామినేషన్‌ దాఖలు చేయడానికి కేజ్రీవాల్ సోమవారం (జనవరి 20) మధ్యాహ్నం తన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఈ ర్యాలీకి ఆప్ కార్యకర్తలు, అభిమానులు పోటెత్తడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో ఆయన సరైన సమయానికి ఎన్నికల కార్యాలయానికి చేరుకోలేకపోయారు. మధ్యాహ్నం 3 గంటల లోపు ఎన్నికల కమిషనర్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేయాల్సి ఉండగా.. అ సమయానికి కేజ్రీవాల్ ఇంకా రోడ్‌షోలోనే ఉన్నారు. తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం కేజ్రీవాల్‌ రోడ్‌షో ద్వారా నామినేషన్‌ వేసేందుకు బయలుదేరారు. వాల్మీకి ఆలయం నుంచి జామ్‌నగర్‌ హౌస్ వరకు రోడ్‌షో ద్వారా వచ్చి ఆయన నామినేషన్‌ వేయాల్సి ఉండగా.. వాహనం వెంట భారీగా మద్దతుదారులు తరలిరావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. రోడ్ల వెంట పెద్ద ఎత్తున చేరిన కేజ్రీవాల్ మద్దతుదారులు ఆప్ ఎన్నికల గుర్తు ‘చీపురు’ను ప్రదర్శిస్తూ అధినేతకు ఆహ్వానం పలికారు. రోడ్‌షోలో సీఎం కేజ్రీవాల్ వెంట ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కూడా ఉన్నారు. ‘నేను నామినేషన్‌ వేయాలనుకున్నా. కానీ, రోడ్‌షోలో పాల్గొన్న ప్రజలను వదిలి ఎలా వెళ్లేది? అందుకే ఆ నిర్ణయం వాయిదా వేసుకున్నా. రేపు నామినేషన్‌ వేయాలని నిర్ణయించుకున్నా’ అని మీడియా ప్రతినిధులతో కేజ్రీవాల్‌ అన్నారు. రేపటితో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగుస్తుండటం గమనార్హం. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడుతాయి. ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలతో ఘన విజయం సాధించింది. ఈసారి కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయని.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ ధీమాగా ఉన్నారు. అయితే.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం 7 నియోజకవర్గాల్లో జయభేరీ మోగించిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని చెబుతోంది.







Untitled Document
Advertisements