కేసీఆర్ సర్కార్ శుభవార్త...రైతులకు రబీ నిధులు విడుదల

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 09:16 PM

కేసీఆర్ సర్కార్ శుభవార్త...రైతులకు రబీ నిధులు విడుదల

కేసీఆర్ సర్కార్ రైతులకు శుభవార్త అందించింది. రైతుబంధు పథకంలో భాగంగా రబీ పంటకు నిధులు మంజూరు చేసింది. రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి సోమవారం (జనవరి 20) ఉత్తర్వులు జారీ చేశారు. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ నగదు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం రూ.12,862 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఖరీఫ్‌లో రూ.6,862 కోట్లు మంజూరు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయగా.. తాజాగా రబీ కోసం రూ.5,100 కోట్ల నిధులను విడుదల చేశారు. ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ కూడా వెంటనే పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల మంజూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థిక శాఖకు అందించనుంది. వివరాలు అందిన వెంటనే ఆర్థిక శాఖ సదరు నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రైతు బంధు, రైతు రుణ మాఫీ నిధులను ప్రధానాస్త్రంగా చేసుకొని ప్రతిపక్షాలు విమర్శలు చేయగా.. ఆ విమర్శలకు చెక్ పెడుతూ ఎన్నికలకు ముందే రైతు బంధు నిధులు విడుదల చేయడం గమనార్హం.







Untitled Document
Advertisements