BIG NEWS: హైదరాబాద్‌‌లో కరోనా వైరస్ కలకలం...!

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 11:19 AM

BIG NEWS: హైదరాబాద్‌‌లో కరోనా వైరస్ కలకలం...!

హైదరాబాద్‌లో ప్రమాదకర కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇందుకోసం ప్రత్యేక వైద్య సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు, ఐసీయూలను ఏర్పాటు చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిని కూడా నియమించారు. ఢిల్లీ నుంచి వైద్య నిపుణులతో కూడిన బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ బృందంలో ఏడు రాష్ట్రాలకు చెందిన 35 మంది వైద్య నిపుణులు ఉన్నారు. కాసేపట్లో ఈ టీమ్ గాంధీ, ఫీవర్ ఆస్పత్రులను సందర్శించనుంది. అనంతరం రాష్ట్ర వైద్య అధికారులతో సమీక్షించనుంది. ఈ బృందం ఉదయం 10 గంటలకు ఫీవర్ ఆస్పత్రి, మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ ఆస్పత్రి సందర్శించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆస్పత్రుల్లోని డాక్టర్లకు వైద్య నిపుణులు వైరస్ గురించిన అవగాహన కల్పించనున్నారు. వైద్య నిపుణులతో కూడిన బృందంలో ఢిల్లీకి చెందిన ఎన్సీడీసీ డైరెక్టర్ డాక్టర్ సుజిత్ సింగ్, అమిత్ సూరీ, మైక్రోబయాలజీ విభాగాధిపతి నందిని దుగ్గల్, హైదరాబాద్‌కు చెందిన వైద్యులు అనిత వర్మ, అజయ్ చౌహాన్, శుభాగార్గ్, ముంబయికి చెందిన వైద్యులు డాక్టర్ వినయ్ గార్గే, ఆర్‌కే గుప్తా, రోజాలిన్ దాస్, చెన్నైకి చెందిన తుషార్ నాలా, ప్రతాప్ సింగ్, డాక్టర్ మోనికా మత్లానీ, బెంగళూరుకు చెందిన డాక్టర్ శిఖా వర్ధన్, ఆర్కే మహాజన్, డాక్టర్ మలా ఛబ్రా, తదితరులు ఉన్నారు. చైనా నుంచి భారత్‌కు వచ్చిన నలుగురు అనుమానితులు అనుమానిత వైరస్ లక్షణాలతో సోమవారం హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రిలో చేరారు. వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యులు పరీక్షించారు. వ్యాధి నిర్ధారణ చేసే నమూనాలను పుణెకు పంపారు. వారికి వైరస్ లక్షణాలేమీ లేవని తేలడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా 7 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా వైద్య పరీక్షల కోసం విభాగాలను ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనుమానిత లక్షణాలున్న వారిని అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రులకు పంపే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చైనా నుంచి వచ్చిన భారతీయులు ఐదుగురు కరోనా అనుమానితులుగా ఉన్నారని వైద్యులు చెప్పారు. కరోనా వైరస్ స్వైన్ ఫ్లూ వంటిదేనని, దగ్గులు, తమ్ములు, జలుబు వల్ల ఇతరులకు సులభంగా వ్యాపిస్తుందని చెప్పారు. నిరంతరం వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్‌ను నిరోధించుకోవచ్చని వెల్లడించారు. అయితే, ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే చైనాలో 106 మంది చనిపోయారు. మరో 1300 కేసులు కొత్తగా నమోదైనట్లు చైనా హెల్త్ కమిషన్ ప్రకటించింది. ఇప్పటి వరకూ కరోనా కేసులు 4,515 ఉన్నాయని వెల్లడించింది.





Untitled Document
Advertisements