ఐపీఎల్ 2020: మార్పులపై దాదా కామెంట్స్

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 12:02 PM

ఐపీఎల్ 2020: మార్పులపై దాదా కామెంట్స్

అహ్మదాబాద్‌లో సోమవారం ముగిసిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ వేదికపై చెలరేగిన ఊహాగానాలకు తెరదించుతూ ముంబైలోని వాంఖెడే స్టేడియంలోనే ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్‌ నిర్వహిస్తామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. అలాగే రాత్రి మ్యాచ్‌లకు సంబంధించిన సమయం, డబుల్ హెడర్స్ (రోజు రెండు మ్యాచ్‌లు)పై తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ఎప్పటిలాగే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లను రాత్రి ఎనిమిది గంటలకు నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. అలాగే డబుల్ హెడర్స్ సంఖ్యను కేవలం ఐదింటికే కుదించినట్లు పేర్కొంది. అహ్మదాబాద్‌లో సమావేశం ముగిశాక గంగూలీ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ నైట్ గేమ్స్‌కు సంబంధించి సమయంలో ఎలాంటి మార్పులేదు. ఎప్పటిలాగే ఎనిమిది గంటలకే ప్రారంభమవుతాయి. ఐదు డబుల్ హెడర్స్ నిర్వహించబోతున్నాం. ముంబైలో ఫైనల్ జరుపుతాం’ అని తెలిపాడు. ఈసారి ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఛారిటీ మ్యాచ్ నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. నిధుల సేకరణ కోసం ప్రపంచంలోని టాప్ ప్లేయర్లతో కలిపి ఆల్ స్టార్ మ్యాచ్‌ను నిర్వహిస్తామని పేర్కొంది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు ఐపీఎల్ మార్చి 29న ప్రారంభమయ్యే అవకాశముంది. దీంతో కొన్నిదేశాలకు చెందిన ప్లేయర్లు ఈ సీజన్ ప్రథమార్థానికి అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఇంగ్లాండ్-శ్రీలంక, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతుండటంతో, ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.






Untitled Document
Advertisements