సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారులకు నిధులు ఎక్కడినుండి వస్తున్నాయో తెలుసా

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 01:33 PM

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలను బయటపెట్టింది. ఈమేరకు కేంద్ర హోంశాఖకు ఈడీ ఓ నివేదికను పంపింది.

కేరళ కేంద్రంగా పని చేస్తున్న పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నుంచి నిరసనకారులకు నిధులు అందుతున్నాయని ఈడీ ఆ నివేదికలో ఆరోపించింది. లాయర్లు కపిల్ సిబాల్ (కాంగ్రెస్ సీనియర్ నేత), ఇందిరా జైసింగ్, దుష్యంత్ దావేలతో పాటు ఇతర న్యాయవాదులు కూడా ఈ సంస్థ నుంచి ఫీజులు స్వీకరించారని తెలిపింది. అయితే ఏయే కేసులకు సంబంధించి వీరు డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని మాత్రం ఈడీ వెల్లడించలేదు.

మరోవైపు, పీఎఫ్ఐ నుంచి డబ్బును స్వీకరించిన విషయాన్ని కపిల్ సిబాల్ ఖండించలేదు. వృత్తిలో భాగంగానే డబ్బు తీసుకున్నానని ఆయన తెలిపారు. 2017-18లో హాడియా కేసును వాదించానని... ఏడు సార్లు కోర్టుకు హాజరయ్యానని... ఈ కేసుకు సంబంధించే తనకు చెల్లింపులు జరిగాయని... నిరసన కార్యక్రమాలకు, దీనికి సంబంధం లేదని చెప్పారు. జైసింగ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.

Untitled Document
Advertisements