బుమ్రాతో పాటు కోహ్లీ కూడా ఫెయిల్ అయ్యాడు: నెహ్రా

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 06:12 PM

బుమ్రాతో పాటు కోహ్లీ కూడా ఫెయిల్ అయ్యాడు: నెహ్రా

భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వన్డేల్లో వరుసగా విఫలమవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన బుమ్రా.. సిరీస్‌లో టీమిండియా 0-3 తేడాతో వైట్‌వాష్‌కి గురవడానికి ఓ కారణంగా నిలిచాడు. దీంతో.. అతనిపై అభిమానులు విమర్శలు గుప్పిస్తుండగా.. మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా మాత్రం బుమ్రాకి మద్దతుగా నిలిచాడు. ‘జస్‌ప్రీత్ బుమ్రా నుంచి ప్రతి సిరీస్‌లోనూ ఒకే తరహాలో ప్రదర్శనని ఆశించకూడదు. అతను ఇటీవల వెన్ను గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేశాడు. ఏ క్రికెటర్‌కైనా.. ప్రతిసారి ఒకే తీవ్రతతో మెరుగైన ప్రదర్శనని కనబర్చడం చాలా కష్టం. అంతెందుకు..? కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కొన్ని సిరీస్‌ల్లో ఘోరంగా ఫెయిలయ్యాడు’ అని ఆశిస్ నెహ్రా వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో మొత్తం 30 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 5.56 ఎకానమీతో 167 పరుగులిచ్చాడు. కానీ.. వికెట్ దక్కకపోవడం అతడ్ని బాధించే అంశమే. భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన తర్వాత బుమ్రా ఓ సిరీస్‌లో ఇలా వికెట్ల ఖాతా తెరవకపోవడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కోహ్లీ చేసిన పరుగులు 75 మాత్రమే.

Untitled Document
Advertisements