ఒక్క సూర్యనమస్కారంతో అమిత లాభాలు!

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 09:39 PM

ఒక్క సూర్యనమస్కారంతో అమిత లాభాలు!

రోజూ కాసేపు సూర్యకిరణాల ఎదురుగా గడిపినా చాలు.. శరీరానికి అవసరమైన డి విటమిన్ అంది అనారోగ్యం దరిచేరదు. కాని మనం ఉదయం 7 గంటలు దాటిన తరువాతే దుప్పటి ముసుగు తీస్తాం. కనీసం ఉదయానే్న వెలుగులు ప్రసరింపజేసే ఆ సూర్యభగవానుడికి నమస్కారం కూడా చేయం.సూర్యభగవానుడు అన్ని జీవులపట్ల సమృదృష్టి కలిగినవాడు. ఆరోగ్యప్రదాత. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు. అందుకే ఆయనకు మిత్రుడని పేరు. సకల ప్రాణులు సూర్యునిపైనే ఆధారపడి ఉన్నాయని రుగ్వేదం చెబుతోంది. అంతేగాక ఆయన ప్రత్యక్ష దైవం. సూర్యభగవానుడి వల్లే రాత్రి పగలు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, రుషులు ఇలా అంతా ఆ ప్రత్యక్ష నారాయణుడిని ఆరాధిస్తూ వచ్చారు. సూర్యభగవానుని పూజించి కోరిన వరాలను పొందినవారు ఎంతోమంది వున్నారు. వనవాస కాలంలో పాండవులు సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన నుంచి అక్షయపాత్రను పొందారు. అలాగే సత్రాజిత్తు సూర్యభగవానుని ప్రార్థించి శమంతకమణిని వరంగా పొందాడు. రామరావణ సంగ్రామంలో శ్రీరాముడు అగస్త్య మహర్షి సలహాతో ఆదిత్య హృదయాన్ని పఠించడంవల్ల రావణుడిపై విజయం సాధించినట్లు రామాయణ మహాకావ్యం పేర్కొంటుంది. ‘ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రువినాశనం’ అని వాల్మీకి మహర్షులవారు రామాయణ మహాకావ్యంలో వివరించారు. హనుమంతుడు, యాజ్ఞవల్క్యుడు సూర్యుని దగ్గరే వేదశాస్త్రాలు నేర్చారు. విజ్ఞాన శాస్త్రాలు సైతం సూర్యుడే విశ్వకర్త అని అంగీకరిస్తున్నాయి. సూర్యుడి పత్నులు సంజ్ఞ, ఛాయ. వారి పుత్రులు యముడు, వైవస్వతుడు, సావర్ణి, శని. పుత్రికల పేరు యమున, తపతి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనే ద్వాదశ నామాలతో సూర్యుడు అర్చించబడుతున్నాడు. సూర్యుని రథాన్ని లాగే గుర్రాలు ఏడు, సూర్య కిరణాల్లో రంగులు ఏడు. రథసప్తమి పర్వదినం జరిగే రోజు ఏడవ తిథి. అందుకే స్వామి సప్తలోక ప్రదీపకుడు. సూర్యుడి రథం పేరు చిత్రరథం, కాబట్టి ఆయన్ను ‘చిత్రరథుడు’ అని పిలుస్తారు. చీకటంతా సూర్యోదయంతో పటాపంచలవుతుంది. ఈ రోజు ఆదిత్యారాధన, పారాయణ చేసి సూర్యభగవానుని దర్శనం చేసుకోవడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం. రథసప్తమి పర్వదినాన మొదట సూర్యుని తల్లి అయిన గాయత్రిని ధ్యానించాలని ధర్మసింధువు బోధించింది. రథసప్తమి నాడు స్నానం చేసేటపుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. చిక్కుడు, జిల్లేడు, రేగు వంటి పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై వుంటుంది. రథసప్తమినాడు శాస్త్రోక్తంగా ‘సప్తమీ వ్రతం’ ఆచరిస్తారు. ముందుగా తులసీకోట ఎదురుగా పసుపు కుంకుమలతో, రంగవల్లులతో అలంకరిస్తారు. కొత్తగినె్నలో ఆవు పాలు, కొత్తబియ్యం పోసి పొంగించి పాయసం వండుతారు. ఎర్రని కమలాలు, గంధాక్షతలతో అష్టోత్తర సహితంగా సూర్యదేవుణ్ని పూజిస్తారు. ఈ వ్రతాచారణవల్ల సద్భావాలు పెంపొందుతాయని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు వివరించాడన్నది ‘భవిష్యోత్తర పురాణం’ కథనం. సూర్యభగవానుడికి కనకాంబరాలు, ఎర్రచామంతి పువ్వులను సమర్పించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. సూర్యభగవానుడికి అనునిత్యం మూడు వేళలలోను అర్ఘ్యం వదిలి నమస్కరించడంవలన పాపాలు పటాపంచలై శుభాలు చేకూరుతాయి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క దేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈ వేళ విశేష పూజలు జరుగుతాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కాశ్మీర్‌లో మార్తాండ దేవాలయం, తమిళనాడులోని సూర్యనార్‌కోయిల్, ఆంధ్రప్రదేశ్‌లో అరసవిల్లి, ఒడిశాలో కోణార్క్ సూర్యదేవాలయం ప్రముఖంగా వున్న సూర్యదేవాలయాలు. అంతేగాక మత్స్యపురాణంలో ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అంటూ సూర్యారాధన సకల రోగాలను పోగొట్టి ఆరోగ్యం ప్రసాదిస్తుందని ఉంది. సాంబపురాణంలో దూర్వాసుని శాపంవల్ల కలిగిన కుష్ఠురోగాన్ని సాంబుడు సూర్యోపాసనవల్ల పోగొట్టుకున్నాడని ఉంది. అంధుడైన అమరమహాకవి మయూర శతకం రచించి తన అంధత్వం పోగొట్టుకున్నాడని ప్రతీతి. సూర్యోపాసనవల్ల సమస్త నేత్ర రోగాలు తొలగిపోయి వంశంలో అంధత్వం రాదని అక్షుపనిషత్తులో వుంది. సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్య నమస్కారాలు చేయడంవల్ల శారీరక, మానసిక ఆధ్యాత్మిక రుగ్మతలు తొలగి, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎంత ధనం వ్యయం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, విద్యాబుద్ధులు ఒంటబట్టక నిరాశలో వున్నవారు సూర్యుని ప్రసన్నం చేసుకుంటే విద్యాభివృద్ధి కలుగుతుందని నవగ్రహ పురాణం చెబుతోంది. అందుకే అందరం రథసప్తమి వ్రతం ఆచరిద్దాం – ఆరోగ్యవంతులుగా ఉందాం.





Untitled Document
Advertisements