కరోనా ఎఫెక్ట్‌‌ :వచ్చే నెల నుంచి ఫోన్లకు తీవ్ర కొరత

     Written by : smtv Desk | Fri, Feb 14, 2020, 02:12 PM

కరోనా ఎఫెక్ట్‌‌ :వచ్చే నెల నుంచి ఫోన్లకు తీవ్ర కొరత

ఎకానమీ స్లౌడౌన్‌‌ వల్ల మిగతా రంగాలన్నీ డల్‌‌ అయిపోయినా మొబైల్‌‌ ఫోన్ల పరిశ్రమ మాత్రం కళకళలాడుతోంది. ఎందుకంటే ప్రజలు మిగతా వస్తువులపై ఖర్చు తగ్గించుకుంటున్నా, స్మార్ట్‌‌ఫోన్ల కొనుగోలును ఆపడం లేదు. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. కరోనా ఎఫెక్ట్‌‌ (కోవిడ్​) వల్ల చైనా నుంచి స్పేర్‌‌పార్టులు రావడం నిలిచిపోవడంతో కంపెనీలు తలపట్టుకుంటున్నాయి. ఇండియాలో నంబర్‌‌వన్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ కంపెనీ షావోమీ స్పేర్‌‌పార్టుల కొరత కారణంగా ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపిల్‌‌ ఐఫోన్‌‌ 11, 11 ప్రొ మోడల్స్‌‌ స్టాకులు ఇది వరకే అయిపోయాయి. చైనా నుంచి సప్లైలు రాకపోతే వచ్చే వారం నుంచి మొబైల్స్ తయారీని పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుందని ఫోన్‌‌ తయారీ కంపెనీలు చెబుతున్నాయి. మార్చి క్వార్టర్‌‌లో ఫోన్ల అమ్మకాలు 15 శాతం వరకు పడిపోతాయనే అంచనాలు ఉన్నాయి. కొత్త ఫోన్ల లాంచ్‌‌లు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. చైనా నుంచి స్పేర్‌‌పార్టులు రాకపోవడం వల్ల తమ కంపెనీ సప్లై చెయిన్‌‌ దెబ్బతినే అవకాశం ఉందని షావోమీ ఇండియా సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు అన్నారు. ఇతర దేశాల నుంచి స్పేర్‌‌పార్టులను తెప్పించడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే సరఫరాలు మాత్రం తప్పకుండా తగ్గుతాయని ఆయన అన్నారు. అన్ని కంపెనీల దగ్గర స్టాక్స్‌‌ అయిపోతున్నాయని, వచ్చే వారం నుంచి అయినా స్పేర్‌‌పార్టులు రాకుంటే తీవ్ర ఇబ్బందులు ఉంటాయని ఇండియా సెల్యులార్‌‌ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్‌‌ (ఐసియా) చైర్మన్‌‌ పంకజ్‌‌ మహీంద్రా హెచ్చరించారు. సాధారణంగా ఇండియాలోని మొబైల్‌‌ కంపెనీలు బ్యాటరీలను, కొన్ని కెమెరా మాడ్యూళ్లను వియత్నాం నుంచి తెప్పించుకుంటాయి. డిస్‌‌ప్లేలు, కనెక్టర్ల కోసం చైనాపైనే ఆధారపడాలి. చిప్స్‌‌ తైవాన్‌‌లో తయారవుతున్నా, వాటికి చైనాలో తుది పరీక్షలు నిర్వహించాకే ఇతర దేశాలకు పంపిస్తారు. ఫీచర్ల ఫోన్లలో వాడే ప్రింటెడ్‌‌ సర్కూట్‌‌ బోర్డులు కూడా చైనావే కాబట్టి వాటి తయారీ కూడా ఆగిపోతుందని ఐసియా వర్గాలు తెలిపాయి. మార్చి రెండో వారం నుంచి ఫోన్లకు కచ్చితంగా కొరత ఏర్పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరో విషయం ఏమిటంటే కరోనా ఎఫెక్ట్‌‌ కొనసాగుతూనే ఉన్నప్పటికీ, చైనాలో ఆపిల్‌‌ ఫోన్లను తయారుచేసే ఫాక్స్‌‌కాన్‌‌ ఫ్యాక్టరీలను తెరవడానికి అనుమతులు వచ్చాయి. విడిభాగాలను శామ్‌‌సంగ్‌‌ సొంతగా తయారు చేసుకుంటున్నందున దీనికి పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ, ఒప్పో, వివో, వన్‌‌ప్లస్‌‌, షావోమీ వంటి చైనా కంపెనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాయి. కరోనా దెబ్బకు చైనా ఇండస్ట్రీలు కుప్పకూలిన విషయం తెలిసిందే. అన్ని ఫ్యాక్టరీల్లో తయారీ దాదాపు నిలిచిపోయింది. స్పెయిన్‌‌లోని బార్సిలోనాలో ఏటా జరిగే మొబైల్‌‌ వరల్డ్‌‌ కాంగ్రెస్‌‌ కరోనా ఎఫెక్ట్‌‌తో బంద్ అయింది. ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ టెక్నాలజీ ఫెస్టివల్‌‌ను ‘కరోనా’ అడ్డుకుంది. తమ ఉద్యోగులకు ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతో కంపెనీలు వణికిపోవడమే ఇందుకు కారణం. ఆ భయంతోనే ఈ ఏడాది టెక్నాలజీ ప్రదర్శనకు రాలేమని కంపెనీలు ప్రకటించాయి. ఇంటెల్‌‌, సోనీ, ఎన్‌‌టీటీ డొకోమో, స్వీడన్‌‌కు చెందిన ఎరిక్‌‌సన్‌‌, దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌‌జీ కంపెనీలూ ఈసారికి గుడ్‌‌బై చెబుతున్నట్టు ప్రకటించాయి. షోలో పాల్గొనే మీ ఉద్యోగుల భద్రతకు మాది పూచీ అని నిర్వాహకులు భరోసా ఇచ్చినా కంపెనీలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు

Untitled Document
Advertisements