యువత, మహిళలకు కేసీఆర్ సర్కార్ నుంచి మరో రెండు పథకాలు!!

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 08:23 PM

యువత, మహిళలకు కేసీఆర్ సర్కార్ నుంచి మరో రెండు పథకాలు!!

కేసీఆర్ అమ్ములపొదిలో నుంచి రెండు కొత్త పథకాలు వదలడానికి రంగం సిద్ధమైంది. టీఆర్‌ఎస్ సర్కార్ త్వరలో ప్రవేశపెట్టనున్న కీలక పథకాల గురించి మంత్రి గంగుల కమలాకర్ హింట్ ఇచ్చారు. గురువారం (ఫిబ్రవరి 27) అన్ని జిల్లాల బీసీ సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కొత్త పథకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ రెండు పథకాలను బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అమలు చేయనున్నారు. వీటితో పాటు సీఎం కేసీఆర్ త్వరలో మరిన్ని పథకాలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘కేసీఆర్ ఆపద్బంధు’ పేరుతో ఎంబీసీ యువకుల కోసం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా ఐదుగురు ఎంబీసీ యువకులకు ఒకటి చొప్పున అంబులెన్స్‌లను పంపిణీ చేయనున్నారు. తద్వారా రెండు రకాల ప్రయోజనాలు కలిగేలా పథకానికి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. మారుమూల పల్లెలకు అంబులెన్స్ సేవలను విస్తరించడం అందులో ఒకటి కాగా.. అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలను యువకులకు అప్పగించి, తద్వారా నిరుద్యోగులకు ఆర్థికంగా చేయూతనివ్వడం మరో అంశం. తొలుత జిల్లాకొక అంబులెన్స్ చొప్పున పంపిణీ చేసి.. స్పందన చూసిన అనంతరం విస్తృతంగా పంపిణీ చేసే ఆలోచనలో టీఆర్‌ఎస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు కుట్టుమిషన్లు అందించడం టీఆర్‌ఎస్ సర్కార్ మరో పథకం. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10000 మంది నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారు. చదువుకున్న నిరుద్యోగ యువతులకు నిఫ్ట్‌ ద్వారా శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఈ రెండు పథకాలను బీసీ సంక్షేమ శాఖలో పరిధిలోనే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం కేసీఆర్ అతి త్వరలోనే ఈ పథకాలను ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు పథకాలు ఇప్పటికే దేశం దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం గురించి ఐక్యరాజ్య సమితి కూడా ప్రస్తావించడం విశేషం. రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ లాంటి పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. అత్యాధునిక సాంకేతిక వినియోగించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. సూపర్ హిట్ అయిన పలు పథకాలను వివిధ రాష్ట్రాలు అమలు చేసే యోచనలో ఉన్నాయి. విశేష ఆదరణ పొందిన ఈ పథకాలు టీఆర్‌ఎస్ పార్టీకి ఎక్కడా లేని బలాన్నిచ్చాయి. అందుకే రాష్ట్రంలో ఏ ఎన్నికలు నిర్వహించినా.. ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. సీఎం కేసీఆర్ మీద అపార నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. జనాదరణ ఇచ్చిన జోష్‌లో గులాబీ పార్టీ అధినేత మరిన్ని పథకాలు ప్రవేశపెట్టడానికి నిర్ణయించారు. సమయానుకూలంగా కొత్త పథకాలు ప్రకటిస్తామని గతంలోనే ఆయన ప్రకటించారు. ఆ పథకాలు కూడా ప్రకటిస్తే.. రాష్ట్రంలో ఇప్పటికే కుదేలైన ప్రతిపక్షాలు ఇక ఉనికే లేకుండా పోతాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అమ్ములపొదిలో కీలక పథకాలు అనేకం ఉన్నాయని.. సమయానుకూలంగా వాటిని ప్రవేశపెడతామని అటు టీఆర్‌ఎస్ నేతలు కూడా గర్వంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దశల వారీగా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మరిన్ని కీలక పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు అంబులెన్స్‌లు అందజేయనున్నట్లు మంత్రి గంగుల చెప్పారు. ఐదుగురు యువతకు ఒక గ్రూప్‌గా అంబులెన్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. 11 సమాఖ్యల ద్వారా వివిధ వృత్తుల వారికి ఆయా రంగాల్లో ఉపాధి కల్పిస్తామని తెలిపారు. బీసీ విద్యార్థుల భవిష్యత్‌ కోసం అధికారులు సమష్టిగా పనిచేయాలని నిర్దేశించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు వసతి గృహాలను సందర్శించాలని మంత్రి సూచించారు. సంక్షేమ వసతి గృహాల ప్రగతి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.





Untitled Document
Advertisements