‘రెడ్’ టీజ‌ర్...మణిశర్మ మార్క్ స్కోర్ రిపీట్

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 06:39 PM

‘రెడ్’ టీజ‌ర్...మణిశర్మ మార్క్ స్కోర్ రిపీట్

క్రైమ్ థ్రిల్లర్ జోన‌ర్‌కి స‌స్పెన్స్ ఎలిమెంట్ చాలా కీల‌కం. అస‌లేం జ‌రుగుతోంది? అన్నది ముందే రివీల్ కాకూడ‌దు. ప్రేక్షకుడి ఊహ‌కు దొరికిపోకూడదు. ఊపిరి బిగ‌బ‌ట్టి కుర్చీ అంచున కూర్చొని చూడ‌గ‌లిగేలా చేస్తేనే స‌క్సెస్ సాధ్యం. అలాంటి గ్రిప్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్లు ఇటీవ‌ల టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ కం ల‌వ్ స్టోరీల‌తో హిట్లు కొట్టే ట్రెండ్ న‌డుస్తోంది. ఆ కోవ‌లోనే మ‌రో ప్రయ‌త్నం ‘రెడ్’. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిశోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వం వ‌స్తోన్న చిత్రం ‘రెడ్’. శ్రీ‌ స్రవంతి మూవీస్ ప‌తాకంపై స్రవంతి ర‌వికిశోర్ నిర్మిస్తున్నారు. ఇదో స‌స్పెన్స్ థ్రిల్లర్ కం ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్. ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ‌ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, చిత్ర ప్రచారంలో భాగంగా శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. టీజర్‌లో ఈ రెండు పాత్రలను పరిచయం చేశారు. ‘‘క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్’’ అంటూ టీజర్‌ మొదలవుతుంది. ‘‘సిద్ధార్థ్, ఆదిత్య ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ లైఫ్స్.. డిఫ‌రెంట్ వ‌ర‌ల్డ్స్’’ అంటూ పోలీస్ అధికారిణిగా నటించిన నివేద థామస్ ఇన్వెస్టిగేష‌న్‌లో చెప్పేసింది. అయితే ఆ రెండు పాత్రల్లో ఏది నిజం? ఏది అబ‌ద్ధం? ఇంకేదో స‌స్పెన్స్ ఎలిమెంట్ ఉందా అనే అనుమానాన్ని టీజర్ చివరిలో కలిగించారు. ‘నేనే’ అనే డైలాగ్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. టీజర్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో అంశం మణిశర్మ నేపథ్య సంగీతం. కిర్రాక్ అంతే. ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ ఫాంలోకి వచ్చిన మణిశర్మ.. ‘రెడ్’ సినిమాకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. మరి ఆయన అందించే ఆల్బమ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం మణిశర్మ ఈ సినిమాతో పాటు చిరంజీవి 152వ చిత్రం, వెంకటేష్ ‘నారప్ప’లకు సంగీత సారథ్యం వహిస్తున్నారు.






Untitled Document
Advertisements