"2007 వరల్డ్ కప్ హీరో...2020 వరల్డ్ హీరో"...భారత క్రికెటర్‌కు ఐసీసీ సెల్యూట్‌

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 01:07 PM


భార‌త మాజీ క్రికెట‌ర్ జోగింద‌ర్ శ‌ర్మ పేరు విన‌గానే అంద‌రికీ 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గుర్తుకువ‌స్తుంది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో ఆఖ‌రి ఓవ‌ర్ వేసిన జోగింద‌ర్‌.. అద్భుతంగా బౌలింగ్ చేసి జ‌ట్టును గెలిపించాడు. దీంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ తొలి ఎడిషన్‌ను గెలిచిన జ‌ట్టుగా భార‌త్ రికార్డుల‌కెక్కింది. ఆ టోర్నీతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన జోగింద‌ర్.. కెరీర్లో మాత్రం నిల‌క‌డ ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయాడు. కొంత‌కాలానికే జ‌ట్టులో చోటు కోల్పోయిన జోగింద‌ర్‌.. 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అయితే తాజాగా జోగింద‌ర్‌ను పొగుడుతూ ఐసీసీ పెట్టిన ట్వీట్ వైర‌లైంది. క్రికెట్ నుంచి రిటైరయ్యాక పోలీసు అధికారిగా హ‌ర్యానా రాష్ట్రంలో జోగింద‌ర్ సేవ‌లందిస్తున్నాడు. త‌న ఫొటోను షేర్ చేసిన ఐసీసీ.. రియ‌ల్ వ‌ర‌ల్డ్‌ హీరో అంటూ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుత కరోనా సంక్షోభ ప‌రిస్థితుల్లో జోగింద‌ర్ పోలీసుగా అద్భుత‌మైన పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు కొనియాడింది. ఇక ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో 77 మ్యాచ్‌లాడిన జోగింద‌ర్‌.. క్రికెట్‌కు చేసిన సేవ‌కుగాను సొంత‌రాష్ట్రం హ‌ర్యానా డిప్యూటీ సూప‌రిటిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఉద్యోగాన్ని క‌ల్పించింది. మరోవైపు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకుగాను భారత ప్రభుత్వం వచ్చేనెల 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మనదేశంలో ఇప్పటివరకు 21 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. ఇక, క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజురోజుకు విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటివ‌ర‌కు నాలుగు ల‌క్ష‌ల‌కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. సుమారు 22 వేల‌మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయాయి.

Untitled Document
Advertisements