"గ్రామంలో వ్యవసాయం చేసుకోవాలని ఉంది"

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 05:17 PM


రేణు దేశాయ్.. పరిచయం అవసరంలేని పేరు. ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. ఆ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు భార్యగా మారారు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. కొన్నేళ్ల వైవాహిక జీవితం తరవాత పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి తన ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే ముద్రను పోగొట్టాలని చూస్తున్నారు. రేణు. అందుకే, తానేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్లపాటు పిల్లలతో పూణేలో ఉన్న రేణు అక్కడ మరాఠీ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే, కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తన టీమ్‌తో కలిసి వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అయితే, అది సినిమా షూటింగా లేదంటే ఏదైనా డాక్యుమెంటరీనా అనే విషయం తెలీదు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆపేశారు. అప్పుడు షూటింగ్ చేసే సమయంలో వికారాబాద్‌లోని మారుమూల గ్రామాలను రేణు దేశాయ్ సందర్శించారు. అక్కడ తీసుకున్న ఫొటోలను ఇప్పటికే రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ గ్రామాల్లో తిరగడం, అక్కడి వాతావరణాన్ని దగ్గరగా చూడటంతో రేణు దేశాయ్‌లో ఒక ఆలోచన వచ్చింది. తాను కూడా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. వికారాబాద్‌లోని ఓ గ్రామంలో అక్కడి పిల్లలతో తీసుకున్న వీడియో, అక్కడి పశువులు, వాతావరణం ఎలా ఉంటుందో చెప్పే వీడియోలను తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాను వ్యవసాయం చేయాలనుకుంటున్నానని ఈ పోస్ట్‌లోనే పేర్కొన్నారు. ‘‘గ్రామీణ జీవనాన్ని కోల్పోతున్నా.. అస్సలు ఇబ్బందిలేని సాధారణ జీవితం.. నా పిల్లలు కాలేజీకి వెళ్లడం ప్రారంభించిన తరవాత ఓ మారుమూల గ్రామంలో వ్యవసాయం చేయాలని నాకు బలమైన కోరిక ఉంది. కొన్ని కూరగాయలను పండించడం, 10 పిల్లులు, 10 కుక్కలు, పశువులను పెంచడం, అపరిమితంగా పుస్తకాలను సరఫరా చేయడం. ఇలా జరిగితే అదే నాకు స్వర్గం అవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది’’ అని రేణు పేర్కొన్నారు.







Untitled Document
Advertisements