కరోనాకి భయపడే సమస్య లేదు అంటున్న ఈ దేశ ప్రజలు ...

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 02:38 PM

కరోనా అంతకంతకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భయం గుప్పిట్లో గడుపుతున్నాయి. ఎక్కిడికక్కడ లాక్ డౌన్లు విధించుకుంటున్నాయి. అయినా యూరప్ దేశమైన స్వీడన్ మాత్రం ఏ మాత్రం టెన్షన్ లేకుండా హాయిగా ఉంది. అంత మాత్రాన ఆ దేశానికి కరోనా సోకలేదని కాదు. ఇప్పటి వరకు ఆ దేశంలో 3,700 కేసులు నమోదు కాగా... 110 మంది మరణించారు. కరోనా ఉన్నప్పటికీ... ఎలాంటి భయం లేకుండా ఆ దేశ వాసులు గడుపుతున్నారు. తన పొరుగు దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే దేశాల మాదిరిగా స్వీడన్ సరిహద్దులను, స్కూళ్లను మూసేయలేదు. వ్యాపార సముదాయాలను బంద్ చేయలేదు. ప్రజల కదలికలపై ఆంక్షలు విధించలేదు. ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది నిజం.

స్వీడన్ ప్రజల జీవన విధానమే ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు అతీతంగా నిలిపింది. ఇతర దేశాల్లో జనాలు గుంపులు గుంపులుగా గడపడానికి ఇష్టపడతారు. కానీ, స్వీడిష్ ప్రజలు గుంపులుగా బతకడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎవరి సొంత ప్రపంచంలో వారు బతకడానికే ఇష్టపడతారు. ఇదే వారిని కరోనా రక్కసి నుంచి కాపాడింది. ప్రజలంతా ఎవరికి వారు స్వచ్ఛందంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తీసుకుంటున్న కొద్దిపాటి చర్యలు కరోనా విస్తరణను అడ్డుకుంటున్నాయి.

అన్ని దేశాల మాదిరే వర్క్ ఫ్రమ్ హోమ్ కు అక్కడి ప్రభుత్వం సూచించింది. అనవసర ప్రయాణాలను పెట్టుకోవద్దని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరింది. కస్టమర్లు కూర్చున్న చోటుకే పదార్థాలను అందించాలని అన్ని రెస్టారెంట్లు, బార్లు, కేఫ్ లను ఆదేశించింది. 50 మంది కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించింది. యూనివర్శిటీలు, కాలేజీలను మూసేసింది. అయితే, 16 ఏళ్ల లోపు విద్యార్థుల కోసం అన్ని స్కూళ్లు పని చేస్తుండటం గమనార్హం.





Untitled Document
Advertisements