బుమ్రా నోబాల్ పై పాక్ క్రికెట్ కామెంట్...భారత్ కౌంటర్

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 08:39 PM

బుమ్రా నోబాల్ పై పాక్ క్రికెట్ కామెంట్...భారత్ కౌంటర్

పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జస్‌ప్రీత్ బుమ్రా నోబాల్ తప్పిదాన్ని తెరపైకి తెచ్చిన ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కి భారత్ అభిమానులు అదేరీతిలో చురకలేస్తున్నారు. బుమ్రా తప్పిదంతో మ్యాచ్‌ మాత్రమే ఓడింది.. కానీ.. మీ మహ్మద్ అమీర్ విసిరిన నోబాల్‌ తప్పిదానికి జైలు శిక్ష పడిందంటూ మ్యాచ్ ఫిక్సింగ్‌ని గుర్తుచేస్తూ కౌంటర్లిస్తున్నారు. పాకిస్థాన్‌లో శనివారం మధ్యాహ్నానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,700 దాటగా.. ప్రజలు ఇప్పటికీ ఇళ్లలో ఉండటం లేదని ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) టోర్నీలోని ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా నోబాల్‌ని తెరపైకి తెచ్చింది. 2017లో ఇంగ్లాండ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఛాంపియన్స్‌ట్రోఫీ ఫైనల్లో జస్‌ప్రీత్ బుమ్రా విసిరిన నోబాల్ కారణంగా ఔట్ నుంచి తప్పించుకున్న ఫకార్ జమాన్ శతకంతో పాక్‌ని గెలిపించిన విషయం తెలిసిందే. దీంతో.. లైన్ దాటి మూల్యాన్ని చెల్లించుకోవద్దంటూ బుమ్రా ఫొటోతో ఇస్లామాబాద్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. బుమ్రాని అవమానించే తరహాలో ఇస్లామాబాద్ టీమ్ ట్వీట్ చేయడంతో భారత్ అభిమానులు 2010లో ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ మ్యాచ్ ఫిక్సింగ్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కి పాల్పడిన అమీర్ ఉద్దేశపూర్వకంగానే నోబాల్ విసిరి ఉండటంతో నిషేధానికి గురవడంతో జైలు శిక్షనీ అనుభవించాల్సి వచ్చింది. దీంతో.. భారత్, పాక్ అభిమానుల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది.






Untitled Document
Advertisements