సెన్సేషనల్ హిట్... ‘నువ్వు వస్తావని’కి @20 ఏళ్ళు

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 06:36 PM

సెన్సేషనల్ హిట్... ‘నువ్వు వస్తావని’కి @20 ఏళ్ళు

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కొన్ని కథాబలంతో విజయం సాధిస్తే.. మరికొన్ని కథనం, కమర్షియల్ అంశాలతో హిట్ కొట్టాయి. అయితే, సూపర్ హిట్ అయిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ కాలేదు. సంగీతం పరంగా సూపర్ హిట్ అయిన సినిమాలు కాస్త తక్కువగానే ఉంటాయి. అలాంటి వాటిలో ‘నువ్వు వస్తావని’ సినిమా ముందు వరుసలో ఉంటుంది. అక్కినేని నాగార్జున, సిమ్రన్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ సినిమాలో ప్రతి పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 5న) విడుదలైంది. ఇదొక్కటే కాదు.. టాలీవుడ్‌లో ఏప్రిల్ 5న విడుదలైన సినిమాలు చాలానే ఉన్నాయి. అంటే వేర్వేరు సంవత్సరాల్లో విడుదలైన సినిమాలు ఇవి. అలాంటి వాటిలో కొన్ని పాపులర్ సినిమాలు ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

‘మనుషుల్లో దేవుడు’కి 46 ఏళ్లు..:

నటరత్న నందమూరి తారకరామారావు, వాణిశ్రీ నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ పిక్చర్ ‘మనుషుల్లో దేవుడు’. బీవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1974 ఏప్రిల్ 5న విడుదలైంది. అంటే, ఈ చిత్రానికి నేటితో 46 ఏళ్లు పూర్తయ్యాయి. నందమూరి తారకరామారావు సమర్పణలో ఈ చిత్రాన్ని అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించారు. ఎస్. హనుమంతరావు, టీవీ రాజు సంగీతం సమకూర్చారు. ‘చల్లని స్వామీ..’, ‘చెట్టంత మగవాడు చెంతనే ఉన్నాడు..’, ‘కోపమా తాపమా..’ పాటలు ఈ సినిమాలో హైలైట్. అప్పట్లో 100 రోజులు ఆడిన సినిమా ఇది.

35 ఏళ్ల ‘మాంగల్యబలం’:

నటభూషణ శోభన్ బాబు, జయసుధ, రాధిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాంగల్యబలం’. 1985 ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం నేటితో 35 ఏళ్లు పూర్తిచేసుకుంది. శోభన్ బాబు అంటే ఫ్యామిలీ డ్రామాలకు పెట్టింది పేరు. ‘మాంగల్యబలం’ కూడా మంచి విజయవంతమైన ఫ్యామిలీ ఫిలిం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించారు.

20 ఏళ్ల ‘నువ్వు వస్తావని...’:

నాగార్జున, సిమ్రన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘నువ్వు వస్తావని’ చిత్రం 2000 ఏప్రిల్ 5న విడుదలైంది. వి.ఆర్. ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి నిర్మించారు. ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘కలలోనైనా కలగనలేదు నువ్వు వస్తావని..’, ‘పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి..’, ‘మేఘమై నేను వచ్చాను..’, ‘కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది..’, ‘రైలు బండిని నడిపేది..’ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజానికి ఇది రీమేక్ మూవీ. తమిళంలో 1999లో విడుదలైన ‘తుల్లద మనముం తుల్లం’ అనే సినిమాను తెలుగులో ‘నువ్వు వస్తావని’ పేరిట రీమేక్ చేశారు. తమిళంలో విజయ్, సిమ్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు.

‘రచ్చ’ సినిమాకు ఎనిమిదేళ్లు:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన మాస్ హిట్ ‘రచ్చ’ సినిమా విడుదలై నేటికి 8 సంవత్సరాలు. 2012 ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదలైంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు మాస్ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. ‘కొణిదెల వారీ కొడుకా నీకపుడే అంతటి దుడుకా..’, ‘హి ఈజ్ ద మిస్టర్ తీస్‌మార్ ఖాన్ రచ్చ’, ‘వానా వానా వెల్లువాయే (రీమిక్స్)’, ‘సింగరేణి ఉంది..’, ‘ఒక పాదం..’ పాటలు ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ ఫేవరేట్ లిస్ట్‌లో ఉంటాయి.

‘బాద్‌షా’కి ఏడేళ్లు:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘బాద్‌షా’ విడుదలై నేటికి ఏడు సంవత్సరాలు. 2013 ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదలైంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ‘దూకుడు’ సినిమా తరవాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన చిత్రమిది. పరమేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మ్యూజికల్‌గానూ హిట్ అయ్యింది. తమన్ స్వరపరిచిన ‘బంతిపూల జానకి జానకి..’, ‘సైరో సైరో..’, ‘బాద్ షా..’, ‘వెల్కమ్ కనకం..’, ‘డైమండ్ గర్ల్..’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సమంత, నాగచైతన్య ‘మజిలీ’కి ఏడాది:

అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంక కౌశిక్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’ ఏడాది పూర్తిచేసుకుంది. ఈ చిత్రం కిందటేడాది ఏప్రిల్ 5న విడుదలైంది. ఈ సినిమాలో సమంత, నాగచైతన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. తమన్ నేపథ్య సంగీతం అందించారు. సమంత, నాగచైతన్యలు పెళ్లి చేసుకున్న తరవాత కలిసి నటించిన చిత్రమిది. వాళ్ల కెరీర్‌లోనే ఇదొక మంచి చిత్రంగా నిలిచిపోయింది.

Untitled Document
Advertisements