భజ్జీ చెంపదెబ్బపై కామెంట్స్ చేసిన శ్రీశాంత్

     Written by : smtv Desk | Sat, Jun 27, 2020, 03:09 PM

భజ్జీ చెంపదెబ్బపై కామెంట్స్ చేసిన శ్రీశాంత్

ఐపీఎల్ 2008 సీజన్‌లో ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ తనని కవ్వించడంతో సహనం కోల్పోయిన హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టడం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. పంజాబ్ జట్టు గెలుపొందగా.. మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల కరచాలనం సమయంలో ఆ ఘటన చోటుచేసుకుంది. ముంబయి టీమ్‌ ఓటమి బాధలో ఉన్న హర్భజన్ మైదానంలోనే శ్రీశాంత్‌పై చేయిచేసుకున్నాడు. దాంతో.. అతనిపై మ్యాచ్ రిఫరీ నిషేధం విధించాడు. వాస్తవానికి ఆరోజు హర్భజన్ సింగ్ తనని చెంపదెబ్బ కొట్టిన తర్వాత కొద్దిసేపటికే ఇద్దరం కలిసి భోజనం చేసినట్లు తాజాగా శ్రీశాంత్ వెల్లడించాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్లు నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్.. ఈ ఏడాది సెప్టెంబరులో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో.. అప్పటి చెంపదెబ్బ ఘటనని ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ గుర్తుచేసుకున్నాడు. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడంలో సచిన్ టెండూల్కర్ సక్సెస్ అయ్యాడని చెప్పుకొచ్చిన శ్రీశాంత్.. భజ్జీ నిషేధాన్ని తాను వ్యతిరేకించినట్లు వెల్లడించాడు.

‘‘సచిన్ టెండూల్కర్ మధ్యవర్తిత్వం కారణంగా చెంపదెబ్బ వివాదం నిమిషాల వ్యవధిలో సమసిపోయింది. మేము ఇద్దరం టీమిండియాకి అప్పటికే కలిసి ఆడాం.. ఆ తర్వాత కూడా ఆడాం. కాబట్టి.. నేనే భజ్జీ దగ్గరకెళ్లి మాట్లాడాను. ఆరోజు రాత్రి ఇద్దరం కలిసి డిన్నర్ కూడా చేశాం. కానీ.. ఆ ఘటనని మీడియా ఓ పెద్ద వివాదంలా మార్చింది. హర్భజన్ సింగ్‌కి ఎలాంటి శిక్ష వేయద్దని అప్పట్లో ప్రాథేయపడ్డాను. అతను మ్యాచ్ విన్నర్.. భారత్‌ తరఫున హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. నేను అప్పుడప్పుడే భారత్ జట్టులో సెటిల్ అవుతున్నాను. దాంతో.. నేను అతడ్ని ఓ సోదరుడిలా భావించా. కానీ.. అప్పట్లో నా రిక్వెస్ట్‌ని మ్యాచ్ అధికారులెవరూ పట్టించుకోలేదు’’ అని శ్రీశాంత్ వెల్లడించాడు.





Untitled Document
Advertisements