కోకొకోలా కంపెనీ నిర్ణయానికి ప్రాధాన్యం

     Written by : smtv Desk | Sat, Jun 27, 2020, 04:51 PM

కోకొకోలా కంపెనీ నిర్ణయానికి ప్రాధాన్యం

ఆన్‌లైన్‌ ప్రపంచంలో జాతి, లింగవివక్షలపై సోషల్ మీడియా సంస్థలు తగిన చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ శీతల పానీయాల కంపెనీ కోకొకోలా సంచలన నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు సోషల్ మీడియా వేదికలకు అడ్వర్డైజ్‌మెంట్ ఇవ్వబోమని ప్రకటించింది. అయితే ఈ చర్యకు అర్థం..ప్రస్తుతం ఎగిసిపడుతున్న ఉద్యమంలో తాము భాగమవుతున్నట్టు కాదని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ వ్యవధిలో తాము ఆన్‌లైన్ అడ్వర్డైజ్‌మెంట్‌కు సంబంధించి కంపెనీ విధివిధానాలను సమీక్షించుకుంటామని తెలిపింది. ‘జాతివివక్ష విద్వేషాలకు సోషల్ మీడియాలోనే కాదు ఈ ప్రపంచంలోనూ స్థానం లేదు’ అని కోకొకోలా కంపెనీ సీఈఓ జేమ్స్ క్విన్సీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా కంపెనీలు తమ వేదికలపై జరుగుతున్న ఘటనలకు మరింత బాధ్యత వహించాలని, పారదర్శకత కనబరచాలని ఆయన సూచించారు.

ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం బ్లాక్ లైవ్స్ మాటర్ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్యమకారులు సోషల్ మీడియాలోనూ విద్వేషాల రూపుమాపాలని ఉద్యమిస్తున్నారు. జాతి, లింగవివక్ష పూరితమైన, విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులపై కంపెనీలు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోకొకోలా కంపెనీ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఇప్పటికే పలు ప్రముఖ బ్రాండ్లు సోషల్ మీడియా వేదికలను బాయ్‌కాట్ చేశాయి.





Untitled Document
Advertisements